కూకట్ పల్లి అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున.. నందమూరి హరికృష్ణ కుమార్తె…నందమూరి సుహాసిని పేరును నిన్న సాయంత్రం ప్రకటించారు. నిన్న కూకట్‌పల్లికి చెందిన టీడీపీ నాయకుల్ని అమరావతికి పిలిపించి మాట్లాడిన చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇస్తున్నందున సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టిక్కెట్ వస్తుందని.. గట్టిగా ఆశించిన కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుకు భవిష్యత్‌లో అవకాశాలు కల్పిస్తానని.. చంద్రబాబు హామీ ఇచ్చారు. టిక్కెట్ వచ్చినట్లే భావించి ప్రచారం కూడా ప్రారంభించిన పెద్దిరెడ్డి చంద్రబాబుతో సమావేశానికి పిలుపు అందినా రాలేదు. కానీ చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని సమాధానం ఇచ్చారు. దాంతో కూకట్‌పల్లి నేతలతో నిన్న అమరావతి సమావేశం ముగిసిన వెంటనే నందమూరి సుహాసిని అభ్యర్థిత్వాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆమె రేపు నామినేషన్ దాఖలు చేస్తారు. అందకు ముందు నందమూరి సుహాసిని విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. కుటుంబసభ్యులంతా ఆమోదించడంతో సుహాసినికి లైన్ క్లియర్ అయింది.
సీమాంధ్రులు మెజార్టీగా ఉన్న కూకట్‌పల్లి నియోజకవర్గంలో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలో దింపాలని చంద్రబాబు నిర్ణయించడం రాజకీయవర్గాల్లో ఓ హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ విషయం నామినేషన్లు ప్రారంభమయ్యే వరకూ బయటకు రాలేదు. ఆ తర్వాత పరిణామాలు వేగంగా సాగిపోయాయి. 48 గంటల్లోనే సుహాసిని రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన చర్చలను కుటుంబం పూర్తి చేసింది. హరికృష్ణ ప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఆయన కుటుంబానికి రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించాలని చంద్రబాబు భావించారు. మొదటగా హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ ను కూకట్ పల్లి లేదా జూబ్లీ హిల్స్ లేదా శేరిలింగంపల్లి నుండి నుంచి పోటీకి దింపాలని భావించారు. ఆయన రాజకీయాలపై ఆసక్తి కనబర్చలేదు. దాంతో టీడీపీ అగ్రనేతలు కూకట్ పల్లిలో ప్రత్యామ్నాయాలవైపు చూశారు. అదే సమయంలో రాజకీయాల్లోకి వచ్చేందుకు సుహాసిని ఆసక్తి కనబరిచారు. చంద్రబాబు కూడా.. అంగీకరించారు. సుహాసినిని కూకట్ పల్లి బరిలో నిలబెట్టి గెలిపించడం పెద్ద కష్టం కాదు. అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సుహాసిని బరిలో నిలిస్తే నందమూరి కుటుంబం మొత్తం మద్దతు తెలుపుతుంది. వ్యతిరేకించే వారు ఎవరూ ఉండరు.
బీజేపీలో ఉన్న పురంధేశ్వరి మాత్రం. ఈ విషయంలో మద్దతు తెలియజేయలేరు. అలాగని ఆమె కూడా వ్యతిరేకించలేరు. హరికృష్ణ మరణం తర్వాత నందమూరి బాలకృష్ణ అబ్బాయిలకు అండగా ఉంటున్నారు. ఎన్టీఆర్ సినిమా విజయోత్సవానికి కూడా హాజరయ్యారు. సుహాసిని తరపున బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సహా కుటుంబం అంతా ప్రచారం చేసే అవకాశం ఉంది. అంటే కూకట్ పల్లిలో కుటుంబం అంతా కలసి రావడం ఖాయం. అదే జరిగిదే… నందమూరి కుటుంబం మొత్తం ఏకతాటిపై ఉందని అది కూడా తెలుగుదేశం పార్టీ వెనుకే ఉందని సంకేతాలను ప్రజల్లోకి పంపినట్లవుతుంది. అదే సమయంలో హరికృష్ణను కోల్పోయిన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సుహాసినికి టిక్కెట్ ఇవ్వడం ద్వారా భరోసా ఇచ్చినట్లవుతుంది. ఓ రకంగా చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం కుటుంబం మొత్తం టీడీపీ వైపే ఉందని మరోసారి నిరూపించడానికి ఉపయోగపడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. తన రాజకీయ అరంగ్రేటం సహా పలు అంశాలపై ఈ సందర్భంగా సుహాసిని మీడియా ప్రతినిధులతో ముచ్చటించనున్నారు.