టీఆర్ఎస్ నేత హరీష్ రావు మీద కూటమి నేతలు చేస్తున్న కామెంట్లు ఇప్పుడు తెలంగాణా రాజకీయాల్లో సంచలనంగా మారాయి. నిన్న గజ్వేల్ కూటమి అభ్యర్ధిగా ప్రచారం అవుతున్న కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి హరీష్ రావు మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ నెంబర్ నుంచి హరీష్ రావు తనకి కాల్ చేసి కేసీఆర్ ని ఓడించాలని చెప్పినట్టు అంతేకాక హరీష్ రావు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని.. త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని అన్నారు. వంటేరు ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యలు మరువక ముందే మరో నేత హరీష్ రావు గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఆయన తాజాగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలో అంతర్యుద్ధం సాగుతోందని, ఎప్పటికైనా ఆ పార్టీ చీలిపోవడం ఖాయమని అన్నారు.
హరీష్ రావు అసలు సిసలైన నాయకుడని ఆయన టీఆర్ఎస్‌లో ఇమడలేకపోతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి, ప్రజాకూటమికి సమానంగా సీట్లు వస్తే అందులో కొంతమందిని తీసుకువచ్చి హరీష్ రావు సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌లో హరీష్ రావు పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే హరీష్ రావు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండేవారని వ్యాఖ్యానించారు. హరీష్‌ను కేసీఆర్ నమ్మడం లేదని, ఈ కారణంగానే కేసీఆర్ పూర్తి అభద్రతాభావంతో ఉన్నాడని అన్నారు. పార్టీలో సీనియర్ నాయకుడైన హరీష్ రావుని అవమానిస్తున్నా విధి లేక ఆ పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు. కొడుకు, కూతురుకే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. సరైన సమయం కోసం హరీష్ ఎదురు చూస్తున్నారని అన్నారు. హరీష్ తన నిజాయితీ, సిన్సియారిటీని నిరూపించుకునేందుకు టీడీపీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మొత్తానికి ఈ విమర్శలు అన్నీ చూస్తుంటే ఇదేదో కేసీఆర్ పుట్టి ముంచే యవ్వారంలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.