‘పార్టీ మారడం’పై హ‌రీష్ రావు స్పందన

Harish Rao reacts on Party Change Issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌వేశించి థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేయ‌నున్న‌ట్టు కేసీఆర్ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌..టీఆర్ ఎస్ ప‌రిణామాల‌పై అనేక ఊహాగానాలు త‌లెత్తాయి. జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌బోయే ముందు… కేసీఆర్… త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌విని కేటీఆర్ కు అప్ప‌గిస్తార‌ని వార్త‌లొచ్చాయి. ఈ వార్త‌ల నేప‌థ్యంలో కేసీఆర్ తీరు న‌చ్చ‌ని ఆయ‌న మేన‌ల్లుడు, భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి హ‌రీష్ రావు 40 మంది ఎమ్మెల్యేల‌తో క‌లిసి బీజేపీలో చేర‌బోతున్నారంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జ‌రిగింది. దీనిపై హ‌రీష్ రావు స్పందించారు. ఈ ప్ర‌చారంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

సోష‌ల్ మీడియాలో ఇలాంటి ప్ర‌చారం చేసిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటానని హెచ్చ‌రించిన హరీష్ రావు త‌న పుట్టుక‌, చావూ కూడా టీఆర్ ఎస్ లోనే అని స్ప‌ష్టంచేశారు. టీఆర్ ఎస్ లో తాను క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన కార్య‌క‌ర్త‌న‌ని, ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాటే… త‌న బాట అని స్ప‌ష్టంచేశారు. త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్దని, త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న‌వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీని కూడా కోరాన‌ని చెప్పారు. తాము ఉద్య‌మాలు, త్యాగాల పునాదుల మీద వ‌చ్చిన‌వార‌మ‌ని, కేసీఆర్ ఆదేశాల మేర‌కు మంత్రి, ఎమ్మెల్యేల ప‌దవుల‌ను గ‌డ్డిపోచ‌గా భావించి రాజీనామాలు చేసిన చ‌రిత్ర త‌మ‌ద‌ని గుర్తుచేశారు. ఇలాంటి పుకార్ల‌కు ఫుల్ స్టాప్ పెట్టాల‌ని, వీటిని ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని హ‌రీష్ రావు మీడియాను కోరారు.