టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ సంస్థ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో అరెస్టయి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. రిమాండ్ గడువు, రెండు రోజుల సీఐడీ కస్టడీ ఆదివారం ముగిసింది. రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరచారు. ఈ సందర్భంగా వచ్చే నెల 5వ తేదీ వరకు బాబు రిమాండ్‌ను పొడిగించారు.
మరోవైపు ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగే అవకాశం ఉంది. రిమాండ్‌ను అక్టోబర్ 5 వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు న్యాయాధికారి, బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణకు వస్తుందని తెలిపారు. మరో రెండు కేసుల్లో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ పిటిషన్లపై విచారణ జరగనుంది. ఫైబర్‌గ్రిడ్ ,ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసుల్లో పీటీ వారెంట్ పిటిషన్లపై విచారణ జరిగే అవకాశం ఉంది.
చంద్రబాబును కోర్టు ముందు హాజరు పరిచిన తర్వాత ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. థర్డ్‌డిగ్రీ ప్రయోగించి ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని అడిగారు. వైద్యపరీక్షలు నిర్వహించారా?.. కోర్టు ఆదేశాల మేరకు సౌకర్యాలు కల్పించారా? అని ఆరా తీశారు. భౌతికంగా ఏమీ ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు బదులిచ్చారు.