మహారాష్ట్ర రాజధాని ముంబైని వాన ముంచెత్తింది. సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా ముంబై జలసంద్రమైంది. ఈ క్రమంలో వాహనాలు, రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముంబై – పుణె మార్గంలో ఇంటర్‌సిటీ రైళ్లను రద్దు చేశారు. లోకల్ రైల్వే స్టేషన్లలోకి భారీగా వర్షపు నీరు రావడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. షెడ్యూల్ ప్రకారం కాకుండా విమానాలు 25 నుంచి 30 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరుతున్నాయి. కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ట్రాఫిక్ భారీగా ఏర్పడింది. జోగేశ్వరి – విక్రోలి లింక్ రోడ్, ఎస్వీ రోడ్, ఎల్బీఎస్ మార్గ్‌తో పాటు ప్రధాన రహదారులన్నీ జలసంద్రమయ్యాయి. ైఫ్లె ఓవర్లపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. భక్తిపార్క్ ఏరియాలో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. హింద్‌మాతా జంక్షన్ నుంచి ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో నివాసాల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.