బావ గెలుపుకోసం కష్టపడుతున్న తెలుగు హీరో

Hero Venu Campaign For Tdp In Khammam District

స్వయంవరం సినిమాతో హిట్టుకొట్టి మరీ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన వేణు తొట్టెంపూడి ఆ తరువాత చేసిన చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. కానీ, కొన్నేళ్లుగా అతనికి అసలు సిసలైన విజయం రాకపోవడంతో, ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో ఒక చిన్నపాటి అతిథి పాత్ర చేసి సినిమాలనుండి తప్పుకున్నాడు. అప్పటినుండి కనపడకుండా ఉన్న హీరో వేణు, ఎన్నికల పుణ్యమా అని మరోసారి కనిపించి, జనాల్లోకి వచ్చాడు. ఖమ్మం నియోజకవర్గం నుండి ప్రజకూటమి పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న నామా నాగేశ్వరరావు ని గెలిపించేందుకు తనవంతుగా శాయశక్తులా పోరాడుతూ, ఖమ్మం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ, ప్రజల కష్టసుఖాలను, సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఖమ్మం నియోజకవర్గంలో కొనసాగుతున్న వేణు పర్యటనకి ప్రజల నుండి మద్దతు మంచిగానే లభిస్తుంది.

hero-venu-tdp

గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగి, బలమైన ప్రత్యర్థిగా పేరొందిన కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిని ఓడించిన నామా నాగేశ్వర రావు 2014 ఎన్నికల్లో మాత్రం ఘోరపరాజయం పాలయ్యారు. రాబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సూచనల మేరకు ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజకూటమి తరపున బరిలోకి దిగిన నామా తన ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశారు. ఈ ఎన్నికల ప్రచారానికి సినీగ్లామర్ ని కూడా అద్దాలని తన మేనబామ్మర్ది అయిన సినీహీరో వేణు తొట్టెంపూడిని కూడా ఎన్నికల ప్రచారానికి దించారు. రాబోయే ఎన్నికల్లో తన బావ నామా నాగేశ్వర రావు ని ఎలాగైనా గెలిపించాలని ప్రజలను కోరుతూ, గత కొన్ని రోజులుగా వేణు ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. 2009 ఎన్నికల్లో కూడా వేణు ప్రచారం చేయగా, నామా నాగేశ్వర రావు గెలుపొందారు. మళ్ళీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందో లేదో వేచిచూడాలి. ఇప్పుడున్న పరిస్థితులలో హీరోగా అవకాశాలు లేక తనకున్న బిజినెస్ లను చూసుకుంటున్న వేణు చేస్తున్న ప్రచారం ఎంతవరకు సత్పలితాలను ఇస్తుందనేది పక్కన పెడితే, అధికారంలో ఉన్న బలమైన తెరాస అభ్యర్థులను ఎదుర్కొని గెలుపొందడం కాస్త కష్టమైన పనే అని చెప్పొచ్చు. రాష్ట్రమంతటా మహాకూటమి కి సానుకూలపవనాలు వీస్తున్న దృష్ట్యా రాబోయే ఎన్నికల్లో ఏదైనా జరగొచ్చు.

 

venu-hero-tdp