Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2016 నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో అడుగుపెట్టారు. అయితే ఎన్నికల్లో ట్రంప్ గెలుపు ఊహించని పరిణామం. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన ట్రంప్ పై డెమోక్రటిక్ మహిళా అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య అయిన హిల్లరీ క్లింటన్ ఘనవిజయం సాధిస్తారని అంతా భావించారు. అమెరికా సంస్థలు నిర్వహించిన అనేక సర్వేల్లో కూడా హిల్లరీదే గెలుపని తేలింది. ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోతారని డెమోక్రటిక్ పార్టీ నేతలే కాదు… సొంతపార్టీ రిపబ్లికన్ పార్టీ కూడా నమ్మింది. హిల్లరీని మరీ ఎక్కువ మెజారిటీతో గెలిపించొద్దని కూడా కొందరు రిపబ్లికన్ నేతలు ప్రజలను కోరారు. ఎన్నికలు లాంఛనమే అని, హిల్లరీ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి… అమెరికా చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలు అయినట్టే అని ప్రపంచమంతా కూడా భావించింది. కానీ చివరకు ఎన్నికల్లో అనూహ్యంగా ట్రంప్ విజయం సాధించి షాకిచ్చారు. ఇది జరిగి సంవత్సరం కావొస్తున్నా… అమెరికా ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి హిల్లరీ తేరుకోలేదు. తన ఓటమికి గల కారణాలేంటో ఇప్పటికీ ఆమెకు అంతుబట్టడం లేదు. బీబీసీ రేడియో4 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు… మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం కూడా తనకు లేదని హిల్లరీ స్పష్టంచేశారు. తన కొత్త పుస్తకం వాట్ హ్యాపెండ్ ప్రచారంలో భాగంగా బీబీసీ రేడియోకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను పాల్గొనబోనని, అయితే ఎన్నికల్లో పోటీచేయనప్పటికీ… తాను రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉంటానని, తన గొంతుకు మద్దతు పలికేవారు ఉన్నారని హిల్లరీ వెల్లడించారు. బిల్ క్లింటన్ భార్యగా అమెరికా ప్రథమ మహిళ హోదాలో ఎనిమిదేళ్లు శ్వేతసౌధంలో ఉన్న హిల్లరీ… అధ్యక్షురాలిగా వైట్ హౌస్ లో అడుగుపెట్టాలన్న కల మాత్రం నెరవేర్చుకోలేకపోయారు. 2008 ఎన్నికల్లోనే ఆమె అధ్యక్షురాలిగా పోటీచేయాలని భావించారు. అయితే డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో ఒబామాతో పోటీపడలేకపోయారు. తర్వాత ఎనిమిదేళ్లకు డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్షురాలి అభ్యర్థిత్వం దక్కించుకున్నా… ఎన్నికల్లో మాత్రం గెలుపు ముంగిట బోర్లా పడ్డారు.