Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డేరా బాబా దత్తపుత్రికగా చెప్పుకునే హనీప్రీత్ ఎట్టకేలకు నేరాన్ని అంగీకరించింది. గుర్మీత్ దోషిగా నిర్దారణ అయిన తర్వాత జరిగిన విధ్వంసం కేసులో గతవారం హనీప్రీత్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తొలుత ఆమె అల్లర్లకు, తనకు సంబంధం లేదని బుకాయించింది. అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ విచారణకు సహకరించకుండా మౌనంగా ఉంది. అయితే ఇప్పటికే పోలీసుల కస్టడీలో ఉన్న డేరా అనుచరులు పంచకుల విధ్వంసంలో ప్రధాన సూత్రధారి హనీప్రీతేనని విచారణలో వెల్లడించారు. దీంతో మరో దారిలేక హనీప్రీత్ నేరాన్ని అంగీకరించాల్సి వచ్చింది.
అల్లర్లకు గైడ్ మ్యాప్ లు తయారుచేశానని, ఇందుకు డేరా శాఖలు కూడా సహకరించాయని వెల్లడించింది. హనీప్రీత్ ఇచ్చిన సమాచారాన్ని ల్యాప్ ట్యాప్ లో భద్రపరిచామని, పంచకులతో పాటు పలుప్రాంతాల్లో జరిగిన హింస కేసుల్లో మరిన్నివిషయాలు రాబట్టే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. పంచకుల అల్లర్ల కోసం హనీప్రీత్ రూ. 1.25 కోట్లు ఖర్చుచేసిందని చెప్పారు. గుర్మీత్ కు శిక్షపడిన తర్వాత భారీ మొత్తంలో నగదును తరలించారని, వాటి వివరాలు కూడా హనీప్రీత్ ల్యాప్ ట్యాప్ లో ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.