Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కరీబియన్ దీవులను అతలాకుతలం చేసిన హరికేన్ ఇర్మా అమెరికాను గజగజలాడిస్తోంది. ఆదివారం ఫ్లోరిడాలోని కీస్ వద్ద దక్షిణ తీరాన్ని తాకిన ఇర్మా..ఇవాళ పశ్చిమ తీరానికి చేరుకుంది. మార్కో ద్వీపం హరికేన్ ప్రతాపంతో విలవిల్లాడుతోంది. ఇర్మా ప్రభావంతో గంటకు 192కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. తీరం వద్ద 15 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. నాప్లెస్, మార్కో ద్వీపాల్లోని ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారు. విద్యుత్ సరఫరా నిలిపివేయటంతో ఆ ప్రాంతమంతా అంధకారం అలుముకుంది. మార్కో ద్వీపం నుంచి ఇర్మా తంపా బే ఏరియా వైపుకు చురుగ్గా కదులుతున్నట్టు అధికారులు తెలిపారు.
హరికేన్ ఫ్లోరిడా తీరాన్ని తాకినప్పుడు తొలుత తీవ్రత తగ్గినట్టు కనిపించింది. కానీ మళ్లీ బలం పుంజుకుని పెను తుపానుగా మారింది. ఇర్మా భయంతో ఫ్లోరిడాలో మూడో వంతు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 63లక్షల మంది ఫ్లోరిడా వాసులు ఇళ్లు ఖాళీ చేశారు. ప్రస్తుతం ఫ్లోరిడా మొత్తం అంధకారంలో మగ్గుతోంది. ఫ్లోరిడా మొత్తం హరికేన్ పరిధిలో ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇర్మా పశ్చిమ దిశగా కదులుతుండటంతో చాలా వరకు ముప్పు తప్పిందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. తూర్పు దిశగా కదిలితే చాలా ప్రమాదం జరిగేదని…ఇది అదృష్టంగా భావిస్తున్నామని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇర్మా నష్టాన్ని పూడ్చుకోవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందని, కానీ డబ్బు కంటే ప్రజల రక్షణే తనకు ముఖ్యమని ఆయన తెలిపారు. మరో నాలుగైదు గంటలు ఇర్మా ప్రభావం తీవ్రంగా ఉంటుందని…
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్రంప్ సూచించారు. ఇర్మా స్థాయి తగ్గుతున్నట్టు కనిపిస్తోందని, వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇర్మా బీభత్సాన్ని అమెరికా టీవీ చానళ్లు విస్తృతంగా కవర్ చేస్తున్నాయి. టీవీ చానళ్లు అన్ని వార్తలనూ పక్కనబెట్టి ఇర్మా విలయతాండానికి సంబంధించిన వార్తలే ప్రసారం చేస్తున్నాయి. ఇర్మా నైరుతి ఫ్లోరిడాను సమీపించిన వేళ వీడియోలు, రాడార్ ఇమేజ్ లు చూపిస్తూ ఓ టీవీ చానల్ యాంకర్ చేసిన వ్యాఖ్యలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇది నమ్మశక్యంగా లేదని, జరుగుతున్నది చూస్తోంటే తన హృదయం బద్దలైందని న్యూప్ రీడర్ వ్యాఖ్యానించింది.
కేప్‌కోరల్ వాయువ్య ప్రాంతం బీభత్సకరంగా మారిందని…6 నుంచి 9 అడుగుల ఎత్తులో అలలు విరుచుకుపడుతున్నాయని, అక్కడ చాలా బీభత్సం జరుగుతోందని ఆమె సమాచారం అందించింది. మరోవైపు ఇర్మా బారిన పడకుండా తప్పించుకునేందుకు ఫ్లోరిడా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడంతో ఇదే అదనుగా చూసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లల్లోకి చొరబడి విలువైన వస్తువులను దోచుకుంటున్నారు. ఫ్లోరిడా తీర ప్రాంతాలతోపాటు ఓర్లాండో, పామ్ బీచ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేకపోవటం దొంగలకు అనువుగా మారింది. దొంగతనాలకు పాల్పడుతున్న పలువురిని ఇప్పటికే ఫ్లోరిడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో ఎవరైనా వచ్చి తలుపు తట్టినా తీయాల్సిన పనిలేదని, సహాయం కావల్సిన వారందరూ ఇప్పటికే శిబిరాలకు చేరుకున్నారని పోలీసులు తెలిపారు.
మరిన్ని వార్తలు: