భార్య మీద అనుమానం…కాలి కింద వేసి మరీ తొక్కి తొక్కి !

husband killed his wife in madanapalle

చిత్తూరు జిల్లా మదనపల్లెలో వివాహిత మర్డర్ మిస్టరీ తేలకముందే తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. అనుమానంతో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడో భర్త. విశాఖపట్నంలోని మధురవాడలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ హత్య వివరాల్లోకి వెళితే సింహాచలం అనే వ్యక్తి విశాఖ నగరంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన రాత్రి వేళల్లో నూడుల్స్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య పద్మ (28)తో పాటు కుమారుడు ధర్మతేజ (9), కుమార్తె సంజన (5) ఉన్నారు. వీరంతా మధురవాడలోని 5వ వార్డు శివసక్తినగర్‌లో నివాసం ఉంటున్నారు. భార్య పద్మ ప్రవర్తనపై సింహాచలం కొద్ది రోజులుగా అనుమానం పెంచుకున్నాడు. మరో వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు అనుమానించి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆగ్రహంతో ఊగిపోయిన సింహాచలం తన భార్యను కిందపడేసి పీక మీద కాలు వేసి తొక్కి చంపేశాడు. ఊపిరాడకపోవడంతో పద్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. శుక్రవారం ఉదయం స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)కు తరలించారు. నిందితుడు సింహాచలం.. పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.