Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దటీజ్ ఇండియా. ఈ విషయంలో మాత్రం ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది. అభివృద్ధి, సంక్షేమం, ప్రమాణాలు, మానవాభివృద్ధి సూచీల్లో వెనుకబడ్డ మన దేశం.. అవినీతిలో మాత్రం సగర్వంగా తల ఎత్తుకుని నిలబెడింది. చివరకు పాకిస్థాన్లో కూడా మన దేశం కంటే తక్కువ అవినీతే ఉందంటే.. అది ఎంత మహమ్మారిగా మారి మనదేశంలో విజృంభిస్తుందో అర్థమవుతోంది.
ఓ అంతర్జాతీయ సంస్థ చేసిన సర్వేలో 69 శాతం మార్కులతో అవినీతిలో మన దేశం టాప్ లో ఉంది. మన తర్వాత సంక్షుభిత వియత్నాం రెండో స్థానంలో ఉంది. జపాన్ లో అన్ని దేశాల కంటే తక్కువ అవినీతి ఉందని సదరు సర్వే తేల్చింది. దేశంలో ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో అంతులేని అవినీతి ఉందని రిపోర్ట్ తేల్చింది. అంటే దేశంలో లాభసాటి వ్యాపారాలు అవి రెండేనేమో.
ఆసియాలోనే అత్యంత అవినీతి దేశంగా నిలవడంపై ప్రభుత్వాలు, పౌరులు అందరూ సిగ్గుపడాల్సిందే. ఎందుకంటే మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకూ మన నేతల అందరి మంత్రం అవినీతికి తావు లేని పాలనే. కానీ ఇంకా మనం ప్రపంచ ప్రమాణాలకు ఆమడ దూరంలోనే ఉన్నాం. ఇప్పటికైనా దిద్దుబాటుకు దిగకపోతే.. అవినీతి రాచపుండే మన దేశాన్ని ముంచేస్తోందని నిపుణులు మొత్తుకుంటున్నారు.