Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వినకుండా కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు భారత్ సరైన సమయంలో సరైన విధంగా షాకిచ్చింది. యాంటీ డంపింగ్ ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తూ పరోక్షంగా చైనాపై ఆర్థిక యుద్ధానికి తెరలేపింది. అనేక రకాల వస్తువులను కారు చౌకగా ఉత్పత్తి చేస్తూ వాటిని వ్యాపారం పేరుతో కుప్పలు తెప్పలుగా భారత్ కు తరలిస్తున్న చైనాకు మన దేశం గట్టి షాకిచ్చింది. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 93 రకాల చైనా సరుకులపై భారీగా యాంటీ డంపింగ్ ఇంపోర్ట్ డ్యూటీ విధించింది. డొక్లామ్ సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకోవటం ద్వారా డ్రాగన్ కు గట్టి హెచ్చరిక పంపింది.
ఇప్పటికే చైనా ఇబ్బడి ముబ్బడిగా తరలిస్తున్న అనేక వస్తువుల తమ వ్యాపారం దెబ్బతింటోందని స్థానిక వ్యాపారులు చాలా మంది చాన్నాళ్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు, సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు, యుద్దం తప్పదన్న చైనా సంకేతాల నేపథ్యంలో ప్రభుత్వం గట్టినిర్ణయం తీసేసుకుంది. ఆందోళనకరంగా మారిన 93 రకాల చైనా ఉత్పత్తులపై దిగుమతి పన్ను విధించామని వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కెమికల్స్, పెట్రో కెమికల్స్, ఉక్కు, నూలు, యంత్ర పరికరాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ ఉత్పత్తులు ఉన్నాయి. దేశీయ పరిశ్రమలను, కొన్ని రంగాలను కాపాడటానికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుంది.
ఎగుమతులపైనే ఎక్కువగా ఆధారపడే చైనాకు మాత్రం ఆర్థికంగా ఇది బాగా నష్టం కలిగించే పరిణామం. ఇంత జరుగుతున్నా చైనా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కొత్తగా భూటాన్ పై తప్పుడు ఆరోపణలకు దిగింది. డొక్లామ్ ప్రాంతం తమ భూభాగం కాదని భూటాన్ దౌత్య మార్గాల ద్వారా భూటాన్ తమకు తెలియజేసినట్టు చైనా సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే దీనికి సంబంధించి చైనా ఎలాంటి ఆధారాలూ చూపించలేదు. ఈ వ్యాఖ్యలను భూటాన్ తీవ్రంగా ఖండించింది. డొక్లామ్ సరిహద్దు అంశంపై తమ వైఖరి స్పష్టమన్న భూటాన్ తమ విదేశాంగ వెబ్ సైట్ లో ఉంచిన అధికారిక ప్రకటనను ఒకసారి పరిశీలించాలని చైనాకు సూచించింది. డొక్లామ్ ముమ్మాటికీ తమ భూభాగమేనని, ఇక్కడ రోడ్డు నిర్మించటం, రెండు దేశాల మధ్య సరిహద్దు నిర్వచన ప్రక్రియను, ఒప్పందాలను ఉల్లంఘించటమేనని భూటాన్ మండిపడింది. మొత్తానికి చైనా హెచ్చరికలకు భారత్ దీటుగా బదులిస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని డ్రాగన్ అబద్ధాలకు తెరలేపింది.
మరిన్ని వార్తలు: