Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అండర్ -19 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత యువ ఆటగాళ్లు విజృంభించారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 272 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభారంభం చేశారు. కెప్టెన్ పృథ్వీ షా, మన్ జోత్ కల్రాతో కలిసి తొలి వికెట్ కు 89 పరుగులు జోడించాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన శుభ్ మన్ గిల్ హైలెట్ ఇ
న్నింగ్స్ ఆడాడు. 94 బంతుల్లో 102 పరుగులుతో నాటౌట్ గా నిలిచాడు. అయితే చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు సాధించే అవకాశం కోల్పోయిన భారత్ 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఏ దశలోనూ పరుగులు సాధించలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్ మెన్ విలవిల్లాడిపోయారు. ముఖ్యంగా పోరెల్ పాక్ పతనాన్ని శాసించాడు.
ఆరు ఓవర్లు బౌలింగ్ చేసిన పోరెల్ కేవలం 17 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. 25 ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 48 పరుగులు మాత్రమే. ఆ దశలో పాక్ స్కోరు 50 అయినా దాటుతుందా అన్న అనుమానాలు తలెత్తాయి. షాద్ ఖాన్ కాసేపు క్రీజులో నిలిచి 15 పరుగులు చేయడంతో పాక్ స్కోరు 60 దాటింది. 69 పరుగుల వద్ద చివరి వికెట్ గా అర్షద్ ఇక్బాల్ ఔటవడంతో పాక్ కథ ముగిసింది. జయాపజయాల సంగతి పక్కన పెడితే ఈ మ్యాచ్ లో క్రీడాస్ఫూర్తి వెల్లివిరిసింది. మైదానంలో భారత్, పాక్ ఆటగాళ్లు ఒకరికొకరు సహకరించుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ సెంచరీకి చేరువైన సమయంలో అతని షూ లేస్ ఊడిపోవడంతో పాక్ ఫీల్డర్ లేస్ కట్టాడు. అలాగే పాక్ బ్యాట్స్ మెన్ షూ లేస్ ఊడిపోయినప్పుడు భారత ఫీల్డర్ సహాయం చేశాడు. సెంచరీ పూర్తి చేసిన శుభ్ మన్ గిల్ దగ్గరకు వచ్చి పాక్ ఆటగాళ్లు చాలామంది అతన్ని అభినందించారు. కీలక మ్యాచ్ లో తీవ్ర ఒత్తిడి మధ్య ఆడుతున్నప్పటికీ ఇర జట్ల ఆటగాళ్లు ఇలా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్రికెట్ అభిమానులు ఆటగాళ్ల వైఖరిని కొనియాడుతున్నారు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా… యువ ఆటగాళ్లు తమ ప్రవర్తనతో మంచి సందేశం ఇచ్చారని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా… మరికొందరు భారత్, పాక్ క్రికెటర్లు ప్రత్యర్థులు మాత్రమే… శత్రువులు కాదు అని కామెంట్ చేస్తున్నారు. అటు ఫిబ్రవరి 3న జరగనున్న ఫైనల్ లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన భారత్ తుదిపోరులోనూ విజయం సాధిస్తుందని అభిమానులు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.