Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డోక్లాం వివాదాన్ని చైనా తిరగతోడుతోంది. ముగిసిన సమస్యను మళ్లీ లేవనెత్తుతోంది. చైనా విదేశాంగ మంత్రి భారత పర్యటన ముగించుకుని స్వదేశానికి వెళ్లిన మరుసటి రోజే డోక్లాంపై చైనా విదేశాంగ శాఖ వివాదాస్పద ప్రకటన విడుదల చేసింది. దానికి కొనసాగింపుగా మరోసారి డోక్లాం వ్యవహారంలో భారత్ పై చైనా అసత్య ఆరోపణలకు దిగింది. ఈ ఏడాది జూన్ లో మొదలై 73 రోజుల పాటు డోక్లాంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు భారత్ కారణమని ఆరోపించింది. డోక్లాం వివాదం భారత్ – చైనా మధ్య ఉన్న బంధాన్ని తెంచుతోందని హెచ్చరించింది. భారత్ దుందుడుకు వైఖరి వల్ల ద్వైపాక్షిక బంధాలను దెబ్బతీసేంతగా డోక్లాం మారిపోయిందని, ఆ ప్రాంతం చైనాదే అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదని వితండవాదన చేస్తోంది. అటు చైనా దళాలు మరోసారి డోక్లాంలో తిష్టవేశాయి.
శీతాకాల క్యాంప్ పేరుతో చైనా సైనికులు దాదాపు 1800 మంది డోక్లాం ప్రాంతంలో ఉంటున్నారు. హెలిపాడ్లు నిర్మించడంతో పాటు రహదారి నిర్మాణాలు చేపడుతున్నారు. దీనిని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది . ఈ మేరకు చైనా దౌత్యాధికారికి హెచ్చరికలు పంపింది. సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుందామంటూనే, ఈ తరహా రెచ్చగొట్టే చర్యలు ఏమిటని భారత్ ప్రశ్నించింది. అటు అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీర్ విషయంలో కూడా చైనా దురహంకారాన్ని బయటపెట్టుకుంటోంది. చైనాలో తయారయిన ఓ గ్లోబులో భారత చిత్రపటం వివాదాస్పదంగా ఉన్న విషయం వెలుగుచూసింది. ఆ గ్లోబు జమ్మూకాశ్మీర్ ను, అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ నుంచి విడదీసి చూపుతోంది.
అరుణాచల్ ప్రదేశ్ ను చైనా అంతర్భాగంగా… జమ్మూకాశ్మీర్ ను స్వతంత్ర ప్రాంతంగా చూపెడుతోంది. కెనడాలోని కోస్టాకోలోని ఒక మాల్ లో ఈ గ్లోబు విక్రయిస్తున్నారు. ఈ వివాదాస్పద గ్లోబును కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. గ్లోబ్ కింది భాగంలో మేడిన్ చైనా అని రాసి ఉండడంతో, చైనా ఉద్దేశపూరకంగానే ఇలా చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కెనడాలో స్థిరపడ్డ భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తక్షణం ఈ గ్లోబును అమ్మకాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ నెటిజన్లు దీనిపై కామెంట్లు చేస్తున్నారు. ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించాలని కోరుతున్నారు.