Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మీకు దేశంపై ప్రేమ ఉంటే చైనా వస్తువులను బహిష్కరించండి… ఈ అర్ధం వచ్చేలా ఉన్న పోస్ట్ ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే దేశభక్తి వేరు… మన అవసరాలు వేరని… ఇలాంటి పోస్టుల ప్రభావం చైనా వస్తువులపై పడదని వ్యాపార వర్గాలు భావించాయి. కానీ ఈ అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయ మొబైల్ వినియోగదారులు చైనా కంపెనీలకు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఒక్క జులైనెలలోనే చైనా మొబైల్స్ ఓప్పో, వివో అమ్మకాలు భారత్ లో 30 శాతం పడిపోయాయి. ఈ క్షీణత ఆగస్టులోనూ కొనసాగుతోంది. తమ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోవటంతో చైనా కంపెనీలు షాక్ తిన్నాయని ఎకనామిక్స్ టైమ్స్ వెల్లడించింది.
ఈ ఏడాది మొదట్లో చైనా మొబైల్స్ వాటా…భారత్ లోని మొత్తం మొబైల్ మార్కెట్ లో 22శాతం ఆక్రమించగా జులైనాటికి మాత్రం పరిస్థితి దారుణంగా దిగజారింది. డోక్లామ్ సరిహద్దు విషయంలో చైనా వైఖరి, యుద్దానికి దిగుతామంటూ ఆ దేశం చేస్తున్న హెచ్చరికలు, పాకిస్థాన్ కు మద్దతివ్వటం వంటి పరిణామాలు చైనా పై భారత్ లో వ్యతిరేకత పెంచుతున్నాయి. ఇది అమ్మకాలపై ప్రభావం చూపింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలోనే ఒప్పో కంపెనీకి సంబంధించిన వివాదం ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఒప్పోకు చెందిన ఓ చైనా అధికారి భారతీయులను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారని ప్రచారం జరిగింది. భారతీయులకు డిగ్నిటీ, సెల్ఫ్ రెస్సెక్ట్ ఉండవని, డబ్బు కోసమే పనిచేస్తారని అనటంతో పాటు… ఇండియాను పరోక్షంగా బిజ్చగాళ్ల దేశం అన్నట్టుగా చేస్తున్న వ్యాఖ్యలను భరించలేక ఎనిమిది మంది భారతీయ ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారని వార్తలొచ్చాయి. ఈ ప్రచారమూ ఒప్పో మొబైల్ అమ్మాకాలపై ప్రభావం చూపిందని భావిస్తున్నారు.
అదే సమయంలో చైనా కే చెందిన మరో కంపెనీ జియోమీ మొబైల్ అమ్మకాల్లో మాత్రం మార్పు రాలేదు. ఒప్పో, వివో కంపెనీలు…తమ అమ్మకాలు తగ్గింది…భారతీయుల్లో చైనా పై వ్యతిరేకత పెరిగినందుకు కాదనీ, ఇన్నాళ్లూ ఆన్ లైన్ అమ్మకాలకే పరిమితమైన జియోమీ రీటెయిల్ అమ్మకాలపై దృష్టిపెట్టి, దూకుడు పెంచటం వల్లేనని విశ్లేషించుకుంటున్నాయి. అయితే భారత్ లో వ్యతిరేకతని పసిగట్టే..జియోమీ ఆఫ్ లైన్ అమ్మకాలు ప్రారంభించిందని, అయినా సరే జియోమీ పైనా రానున్న రోజుల్లో ఈ ప్రభావం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి . ప్రస్తుతం జియోమీ భారత మార్కెట్ లో నెంబర్ టూగా ఉంది. అటు ఒప్పొ, వివో నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టాయి. తమ ఉన్నతాధికారులను హుటాహుటిన భారత్ కు పంపించిన కంపెనీలు మార్కెటింగ్‌లో దిట్టలైన ఇండియన్ ఎగ్జిక్యూటివ్స్ సాయంతో రిటెయిల్ స్టోర్లలో అమ్మకాలు పెంచేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. మరి ఇవిఎంతవరకూ ఫలితాన్నిస్తాయో చూడాలి. ఇప్పటికైనా చైనా తన వైఖరి మార్చుకోకపోతే… ఆ దేశ కంపెనీల వ్యాపారం మరింతగా దెబ్బతింటుందనడంలో సందేహం లేదు.
మరిన్ని వార్తలు: