మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 15వ తేదిన ప్రభుత్వం ప్రారంభిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రంగాల ప్రముఖులకు, సెలబ్రిటీలకు స్వయంగా లేఖలు రాశారు. అందులో పలువురు తెలుగు సెలెబ్రిటీలకు, సినీ నటులకు కూడా చోటు దక్కింది.
తెలుగు సినీ నటులు మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ప్రభాస్‌తో పాటు సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, దేవీశ్రీ ప్రసాద్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నటీమణులు అనుష్క శెట్టి, సమంత అక్కినేని, కాజల్ అగర్వాల్, రామోజీ సంస్థల అధినేత రామోజీరావు కూడా ఈ లేఖను అందుకున్నారు. పరిశుభ్ర భారత్ నిర్మాణానికి అందరూ సహకరించాలని మోదీ ఈ లేఖలో పేర్కొన్నారు. గాంధీ కలలుగన్న భారతదేశం పరిశుభ్ర భారతదేశమని మోదీ తెలిపారు. ఈ పరిశుభ్ర భారతదేశం గురించి ప్రచార కార్యక్రమమే ” స్వచ్ఛతా హీ సేవా” కార్యక్రమమని తెలిపారు. ” స్వచ్ఛతా హీ సేవా” కార్యక్రమాన్ని విజయవంతం చేసి గాంధీజీకి సరైన రీతిలో నివాళులు అర్పిద్దామని మోదీ తెలిపారు. గాంధీజీ కలలుగన్న పరిశుభ్ర భారత్ నిర్మాణానికి కలిసి రావాలని లేఖలో కోరారు. సెప్టెంబర్ 15న ప్రధాని మోదీ స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.