Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీదేవి వివాదాస్పద మరణం విషయంలో భారత మీడియా వైఖరిని దుబాయ్ మీడియా మరోసారి తప్పుబట్టింది. దుబాయ్ కు చెందిన దిగ్గజ మీడియా సంస్థ ఖలీజ్ టైమ్స్ భారత మీడియాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఓ కథనం ప్రచురించింది. శ్రీదేవిని భారత మీడియానే హత్య చేసిందని ఆరోపించింది. శ్రీదేవి మృతి చెందినప్పటి నుంచి తమ వార్తాసంస్థ ప్రతినిధులు వాస్తవ సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తే… భారతీయ మీడియా మాత్రం సమాచారాన్ని వక్రీకరిస్తూ చూపిందని విమర్శించింది. శ్రీదేవి ప్రమాదవశాత్తూ మృతిచెందారని ఆరోగ్యశాఖ ప్రకటించినప్పటికీ భారత మీడియా అత్యుత్సాహంతో ఎన్నో అసత్యాలను ప్రసారం చేసిందని ఖలీజా టైమ్స్ ఆరోపించింది. అంతేకాకుండా… భారత్ లోని చాలా మంది ఇళ్లల్లో బాత్ టబ్ లు ఉండవని, వాటి వాడకం గురించి వారికి తెలియదని ఎద్దేవా చేసింది. బాత్ రూమ్ లోకి వెళ్లి టబ్ లో రిపోర్టర్లు దిగి అక్కడి నుంచి రిపోర్టింగ్ చేస్తూ భారతీయ జర్నలిస్టులు విపరీతంగా ప్రవర్తించారని విమర్శలు గుప్పించింది.
శ్రీదేవి మృతిపై రాజకీయ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి, అమర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఖలీజాటైమ్స్ తప్పుబట్టింది. ఇప్పుడే కాదు… శ్రీదేవి మృతిపై దుబాయ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో కూడా ఖలీజా టైమ్స్ భారత మీడియా వైఖరిని తప్పుబట్టింది. శ్రీదేవి మృతి విషయంలో ముందుగానే ఒక నిర్ధారణకు వచ్చేందుకు, జడ్జి పాత్ర పోషించేందుకు భారత మీడియా ప్రయత్నిస్తోందని ఆరోపించింది. శ్రీదేవి కేసు విషయంలో పలువురు సెలబ్రిటీలు కూడా భారత మీడియాను తప్పుబట్టారు. జర్నలిస్టులు నైతికవిలువలు ఉల్లంఘించారని సెలబ్రిటీలు మండిపడ్డారు. మీడియా సంగతి పక్కనపెడితే… శ్రీదేవి హఠాన్మరణం, కుటుంబ సభ్యులు ఆమె గుండెపోటుతో మరణించారని చెప్పడం, ఫోరెన్సిక నివేదికలో బాత్ టబ్ లో మునిగి ఊపిరాడక చనిపోయారని వెల్లడవడంపై అందరికీ సందేహాలు తలెత్తాయి.
అసలు బాత్ టబ్ లో మునిగి మనిషి చనిపోవడం జరుగుతుందా… అన్నది అందరికీ అనుమానం కలిగించిన ప్రశ్న. ఇలాంటి సమయంలో సందేహాలన్నింటినీ నివృత్తిచేయాల్సిన బాధ్యత ఉన్న దుబాయ్ పోలీసులు… తూతూమంత్రంగా దర్యాప్తు ముగించి… కేసును క్లోజ్ చేయడం, దానికి దుబాయ్ మీడియా ఒత్తాసు పలకడం చూస్తుంటే… ఏదో జరిగిందని, దుబాయ్ అధికారులు ఎవరి ఒత్తిడితోనో ఈ కేసులో కీలక నిజం దాచిపెట్టారన్న భావన కలిగింది. దుబాయ్ మీడియా దీనిపై వివరణ ఇవ్వకుండా… భారత మీడియాను తప్పుపట్టడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.