లీడ్స్: వరల్డ్‌కప్ సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై కన్నేసింది. చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా భారత్ ఇవాళ శ్రీలంకను ఢీకొంటుంది. ఇప్పటికే నాకౌట్ చేరినప్పటికీ ఈ మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసంతో సెమీస్ పోరుకు దూసుకెళ్లాలని కోహ్లీసేన ఆశిస్తోంది. టాప్ ఆర్డర్ రాణిస్తున్నా మిడిల్ సమస్యతో సతమతమవుతున్న కోహ్లీ సేన ఈ మ్యాచ్‌లో ఆ లోపాలను సరిదిద్దుకోవాలనుకుంటున్నది. మరోవైపు పేరుకు తగ్గట్లు రాణించలేకపోయిన లంకేయులు చివరి మ్యాచ్‌లోనైనా నెగ్గి విజయంతో టోర్నీ ముగించాలని ఆశతో ఉన్నారు. సెమీస్‌లో కాస్త సులువైన ప్రత్యర్థి అని అనుకుంటున్న న్యూజిలాండ్ ఎదురవ్వాలంటే భార త్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలువాల్సి ఉంటుంది.
ప్రస్తుతం 13 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్న టీమ్ఇండియా లంకను ఓడిస్తే 15 పాయింట్లతో టాప్కు చేరుతుంది. మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా నెగ్గితే మన స్థానంలో మార్పు లేకుండా కివీస్‌తో తలపడొచ్చు. ఒకవేళ ఆసీస్ నెగ్గితే.. సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో భారత తలపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ మ్యాచ్ ఫలితం మన చేతిలో లేదు కాబట్టి చివరి మ్యాచ్‌లో నెగ్గి టాప్ కు వెళ్లాలని భారత్ పట్టుదలగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో భీకరంగా కనిపిస్తున్న టీమ్ఇండియాకు.. లంక ఏ మాత్రం పోటీనిస్తుందో చూడాలి.
మధ్యాహ్నం 3గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో..