Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారతీయ సాఫ్ట్ వేర్ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ లో పెను సంచలనం నమోదయింది. చరిత్రలోనే తొలిసారి ఇన్ఫోసిస్ షేర్ల బై బ్యాక్ కు సిద్దమవుతున్న వేళ సంస్థ సీఈవో, ఎండీ రాజీనామా చేశారు. అభిప్రాయభేదాల వల్లే తాను తప్పుకుంటున్నట్టు సిక్కా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. సిక్కా రాజీనామాను కంపెనీ ఆమోదించింది. విశాల్ సిక్కా రాజీనామాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించినట్టుగా అన్ని స్టాక్ ఎక్సేంజ్ లకు ఇన్ఫోసిస్ సమాచారం అందించింది. దీంతో ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ పైనా పడింది.
ఆగస్టు 19న జరగబోయే బోర్డు డైరెక్టర్ల సమావేశంలో బైబ్యాక్ విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఇన్ఫోసిస్ ఇటీవలే ప్రకటించింది. ఈ సమావేశానికి ఒక్కరోజు ముందు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సిక్కా రాజీనామా చేయటం సంచలనంగా మారింది. సిక్కా స్థానంలో తాత్కాలిక ఎండీ, సీఈవోగా ప్రవీణ్ రావ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
బెంగళూరు యూనివర్శిటీలో ఎలక్టి్కల్ ఇంజినీరింగ్ చదివిన ప్రవీణ్ 1986లో ఇన్ఫోసిస్ లో చేరారు. సుదీర్ఘ కాలంగా కంపెనీలో ఉన్న ప్రవీణ్ అనేక కీలక పదవులు నిర్వహించారు. అటు సిక్కా రాజీనామాకు, ఇటీవల కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్ లకు వేతన ప్యాకేజీలను భారీగా పెంచటంపై చెలరేగిన వివాదంతో పాటు పలు కారణాలు కనిపిస్తున్నాయి. కిందిస్థాయి ఉద్యోగుల కంటే…ఉన్నతస్థాయి ఉద్యోగుల జీతాలను భారీగా పెంచటం సరికాదంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి గతంలోనే లేఖ రాశారు.
కంపెనీని వదిలి వెళ్లిపోయిన కొందరు ఎగ్జిక్యూటివ్ లకు భారీ మొత్తంలో వీడ్కోలు ప్యాకేజీ ఇవ్వటంపైనా ఇన్పోసిస్ ప్రమోటర్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతోపాటు సంస్థ కొంతకాలంగా అంతర్గత, బాహ్య సవాళ్లుతో సతమతమవుతోంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి ఓ వైపు, కంపెనీ కార్పొరేట్ పాలనలో లోపాలు మరో వైపు సంస్థను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఈవో బాధ్యతల నుంచి సిక్కా హఠాత్తుగా తప్పుకోవటం చర్చనీయాంశమయింది. తన రాజీనామా కారణాలను బ్లాగులో వివరించారు సిక్కా.
ఎంతో ఆలోచించిన తరువాత రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, కొ్న్నిరోజులుగా నిరాధారమైన ఆరోపణలతో వ్యక్తిగత విమర్శలు తనపై ఎక్కువయ్యాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని సిక్కా చెప్పారు. స్టీవ్ జాబ్స్ చెప్పినట్టు తాను తన మనస్సును, కలలనే అనుసరిస్తానని, ఇప్పుడు తాను ముందుకెళ్లాళ్సిన సమయం వచ్చిందని తెలిపారు. గడచిన మూడేళ్లలో ఎంతో సాధించామని, కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టామని, ఎన్ని సమస్యలెదురైనా ఏ క్షణమూ తాను బాధపడలేదని .వివరించారు. ఇన్నాళ్ల పాటు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మూవింగ్ ఆన్ పేరు పెట్టి సిక్కా ఈ కారణాలను బ్లాగులో రాశారు. మరోవైపు సంస్థ వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఇన్ఫోసిస్ లోకి మళ్లీ అడుగుపెడుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి.
మరిన్ని వార్తలు: