మ‌న‌సు మాటే కాదు..మెద‌డు మాటా వినండి

interesting-news-about-sanjay-dutt-life-story

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలియ‌ని వ‌య‌స్సులో త‌ప్పులు చేసి త‌ర్వాత ప‌శ్చాత్తాపంతో కుమిలిపోయే వారు ఎంద‌రో. బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్ కూడా ఆ కోవకే చెందుతారు. ఢిల్లీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చూస్తే వ‌య‌సుతో వ‌చ్చిన ప‌రిణ‌తితో పాటు..తెలియ‌క చేసిన త‌ప్పుల‌పై ఆయ‌న ప‌శ్చాత్తాపం వ్య‌క్తంచేస్తున్న తీరు అంద‌రినీ ఆలోచింప‌జేస్తుంది. ఢిల్లీలో జ‌రిగిన మైండ్ రాక్స్ 2017 కార్య‌క్ర‌మంలో సంజ‌య్ ద‌త్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న జీవితంలోని అనేక విష‌యాల గురించి సంజ‌య్ అభిమానుల‌తో ఓపెన్ గా మాట్లాడారు. త‌న తండ్రి త‌న‌ను అంద‌రిలాగే సాధార‌ణ పిల్ల‌ల్లాగానే పెంచార‌ని, ఇప్పుడు తానూ త‌న కుమారుడిని అలాగే పెంచుతున్నాన‌ని సంజ‌య్ అన్నారు. అయితే త‌న కుమారుడు త‌న‌లా కాకూడద‌ని దేవుణ్ని ప్రార్థిస్తున్నాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. మ‌న‌సు చెప్పే మాట మాత్ర‌మే కాకుండా అప్పుడప్పుడూ మెద‌డు చెప్పే మాట కూడా వినాల‌ని ఆయ‌న సూచించారు. కాలేజీ రోజుల్లో తాను డ్ర‌గ్స్ కు అల‌వాటు ప‌డ్డాన‌ని, ఆ వ్య‌స‌నం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు త‌న‌కు ప‌దేళ్ల స‌మ‌యం ప‌ట్టింద‌ని తెలిపారు.

ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభ‌వించ‌టంపైనా సంజ‌య్ ద‌త్ నోరువిప్పారు. ఒక చిన్న పేప‌ర్ స్టేట్ మెంట్ కార‌ణంగా త‌న ద‌గ్గ‌ర అక్ర‌మంగా ఆయుధం ఉంద‌న్న నెపంతో కేసు వేశార‌ని సంజ‌య్ ఆవేద‌న వ్య‌క్తంచేశారు. జైల్లో త‌న ఇష్ట‌దైవం శివుడి పుస్త‌కాలు చ‌దువుతూ కాలం గ‌డిపేవాడిన‌ని అన్నారు. సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్ త‌న అభిమాన న‌టుడ‌ని, మున్నాభాయ్, వాస్త‌వ్ సినిమాలు అంటే ఇష్ట‌మ‌ని సంజ‌య్ వివ‌రించారు. సునీల్ ద‌త్, న‌ర్గీస్ గారాల పుత్రుడైన సంజ‌య్ ద‌త్ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. చెడు స్నేహితుల ప్ర‌భావ‌మో లేక డ‌బ్బు వ‌ల్ల వ‌చ్చే విచ్చ‌లవిడిత‌న‌మో గానీ తెలియ‌దు గానీ యుక్త‌వ‌య‌స్సులోనే ఆయ‌న జీవితం గాడిత‌ప్పింది. చ‌దువుకునే రోజుల్లోనే డ్ర‌గ్స్ కు బానిసైన సంజ‌య్ ద‌త్..

చాన్నాళ్లు ఆ అలవాటును వ‌దులుకోలేక‌పోయాడు. పొడ‌వైన జుల‌పాల‌తో..వెరైటీ హెయిర్ స్ట‌యిల్ తో ఉండే సంజ‌య్ ద‌త్ కు బాలీవుడ్ లోకి ప్ర‌వేశించిన తొలినాళ్ల‌లోనే మంచి ఫాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అవ‌కాశాలూ క్యూ క‌ట్టాయి. ఆయ‌న సినిమాలు కొన్ని భారీ హిట్లూ న‌మోదుచేసుకున్నాయి. కానీ త‌ర్వాత ముంబై పేలుళ్ల కేసు విచార‌ణ స‌మ‌యంలో సంజ‌య్ ఇంట్లో అక్ర‌మ ఆయుధం దొర‌క‌డంతో ఆయ‌న జీవితం మ‌రోమారు గాడిత‌ప్పింది. ఈ కేసులో ఆయ‌న కొన్నాళ్లు జైలు ఊచ‌లు లెక్క‌పెట్టాల్సి వ‌చ్చింది. దీంతో కెరీర్ కు బ్రేక్ ప‌డింది. త‌ర్వాత జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సినిమాల్లో న‌టించినా ..

సంజ‌య్ స్టార్ హీరో హోదా సంపాదించుకోలేక‌పోయారు. ముంబై పేలుళ్ల కేసులో ఆయ‌న జైలుకు వెళ్ల‌క‌పోతే… ఖాన్ త్ర‌యాన్ని మించి సంజ‌య్ బాలీవుడ్ లో దూసుకుపోయేవార‌ని సినీవిశ్లేష‌కులు అంటుంటారు. మొత్తానికి జైలు జీవితం తెచ్చిన మార్పో లేక‌…తండ్రి త‌న కోసం ప‌డిన తాప‌త్ర‌యం అర్ధం చేసుకున్నారో తెలియ‌దు గానీ…. చివ‌ర‌కు గ‌త జీవిత‌పు చేదు జ్ఞాప‌కాల‌ను వదులుకుని సంజ‌య్ ద‌త్ ప్ర‌స్తుతం హుందా అయిన జీవితం గ‌డుపుతున్నారు. ఆయ‌న జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. సంజ‌య్ కు ఎన్నో హిట్లు ఇచ్చిన రాజ్ కుమార్ హిర్వాణి ఈ సినిమా రూపొందిస్తున్నారు. సంజ‌య్ పాత్రను ర‌ణ‌బీర్ క‌పూర్ పోషిస్తున్నారు.