బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం మిషన్ మంగళ్. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని జగన్ శక్తి తెరకెక్కిస్తున్నారు. తాప్సీ, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్, కీర్తి కుల్హరి, షర్మన్ జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్గా చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్ ధావన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. 2013లో భారత్ చేపట్టిన ‘మంగళ్యాన్’ మిషన్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘ఒక దేశం, ఒక కల, ఒక చరిత్ర.. భారతదేశం నుంచి అంగారకుడిపైకి పంపిన తొలి ఉపగ్రహం మంగళ్యాన్ కథ ఆధారంగా రాబోతున్న చిత్రం టీజర్ ఇదిగో’ అంటూ టీజర్‌ని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు అక్షయ్.
ఈ చిత్ర టీజర్‌పై అభిమానులు, సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) కూడా టీజర్‌పై స్పందించింది. ఒక దేశం. ఒక కల. స్పేస్ సూపర్ పవర్‌గా ఇండియా తయారవుతుంది. మరి కొద్ది రోజులలో ఇస్రో ఖాతాలో మరో మైలు రాయి చేరుతుంది. చంద్రయాన్ 2తో సరికొత్త చరిత్ర సృష్టిస్తామని ఇస్రో పేర్కొంది. ఈ ట్వీట్‌పై స్పందించిన అక్షయ్.. ఆకాశానికి హద్దులు లేవు. చంద్రయాన్ 2 టీంకి నా శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. స్పేస్ చిత్రంగా రూపొందుతున్న ‘మిషన్ మంగళ్’ మూవీని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. . బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇందులో రాకేష్ పాత్ర పోషిస్తున్నారు.