నేడు చంద్రయాన్​-3 ల్యాండర్‌, రోవర్‌లను నిద్ర లేపనున్న ఇస్రో..

ISRO will wake up Chandrayaan-3 lander and rover today.
ISRO will wake up Chandrayaan-3 lander and rover today.

ప్రపంచంలోనే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన దేశంగా భారత్ ఘనత సాధించిన విషయం తెలిసిందే. జాబిల్లిపై అడుగుపెట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా తనకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తిచేసింది. ఆ తర్వాత జాబిల్లి ఒడిలో నిద్రాణ స్థితిలోకి వెళ్లింది. అయితే ఇన్నాళ్లు అక్కడ చీకటి కమ్ముకున్న నేపథ్యంలో ల్యాండర్, రోవర్​లను ఇస్రో శాస్త్రవేత్తలు నిద్రపుచ్చారు.

ఇప్పుడు అక్కడ పగటి సమయం కావడంతో విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లను తిరిగి క్రియాశీలకంగా మార్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇస్రో వెల్లడించింది. ల్యాండర్‌, రోవర్‌తో కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించే ప్రయత్నం చేసినట్లు తెలిపింది. అయితే ఇప్పటివరకు తమకు వాటి నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదని.. ల్యాండర్‌, రోవర్‌ను క్రియాశీలకంగా మార్చే ప్రయత్నాలు కొనసాగుతాయని ఇస్రో చెప్పుకొచ్చింది.

చంద్రయాన్-3ని కేవలం 14 రోజుల పాటు మాత్రమే పనిచేసేలా రూపొందించినట్లు అంతరిక్ష శాస్త్రవేత్త సువేందు పట్నాయక్ తెలిపారు. రాత్రి పూట చంద్రుడిపై ఉష్ణోగ్రతలు మైనస్ 250 డిగ్రీలకు పడిపోతాయని… అటువంటి పరిస్థితుల్లో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు పని చేయడం చాలా కష్టమని.. ఈ కారణంగానే 14 రోజుల తర్వాత చంద్రయాన్-3కి చెందిన ల్యాండర్​, రోవర్​లు పనిచేయదని అనుకుంటున్నామని అన్నారు. కానీ, కొంతమంది శాస్త్రవేత్తలు.. అవి తిరిగి పనిచేస్తాయేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని.. ఒకవేళ అదే జరిగితే ఎన్నో కీలక విషయాలు చేపట్టవచ్చని చెప్పారు.