ఏపీలోని పలువురు మంత్రులపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం ఉండవల్లిలోని ప్రజా వేదికలో జరగాల్సిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం వాయిదా పడిన తర్వాత ఆయన మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏపీ మంత్రుల మీద ఐటీ దాడులు జరిగే అవకాసం ఉందని ఆయన మంత్రులను హెచ్చరించినట్టు తెలుస్తోంది.
ఇదే సమయంలో కేంద్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తెదేపా ఎలాంటి పాత్ర పోషించాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. చంద్రబాబు ప్రధాని కావాలంటూ మంత్రులు ఎక్కడా వ్యాఖ్యలు చేయవద్దని సీఎం స్పష్టంచేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు బీజేపీ ఆడిస్తున్న నాటకమేనని ఈ నాటకాన్ని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. సంచలనం కోసమే అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు హత్య చేశారని తెలిపారు. ఇకపై ప్రతి నెల మంత్రులు, అధికారులపై సమీక్షను నిర్వహిస్తానని చెప్పారు.