తెలుగు దేశం నేతలు ముందు నుండీ చెబుతున్న విధంగానే ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నివాసంపై ఐటీ దాడులు చేపట్టారు. ఏకకాలంలో హైదరాబాద్, కడప జిల్లాలో ప్రారంభమైన ఈ దాడుల్లో 100 మంది ఐటీ అధికారులు పాల్గొన్నారు. సీఎం రమేష్ నివాసాలు, వ్యాపార సంస్థల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని సీఎం రమేష్ నివాసం, ఆఫీసుల్లో, కడప జిల్లా పోట్లదుర్తిలోని ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నారు. సీఎం రమేష్ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు సాగుతున్నాయి.
సోదాల్లో 15 మంది కమిషనర్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. దాదాపు 25 నుంచి 30 చోట్ల ఐటీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే సీఎం రమేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర పీఏసీ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ ఢిల్లీలో జరిగిన పీఏసీ సమావేశంలో దేశంలో ఐటీ దాడులు ఎక్కడ, ఎందుకు చేస్తున్నారు, ఏపీలో దాడుల వివరాలు ఇవ్వాలంటూ ఐటీకి ఆయన నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన మూడు రోజుల్లోనే రమేష్ ఆస్తులపై దాడులు జరుగుతుండడం గమనార్హం.