Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా అధ్యక్షుల ప్రేమాయణాలు, వారి వివాహేతర సంబంధాలు, వైవాహిక జీవిత విశేషాలు… ఎప్పుడూ వార్తల్లో అంశాలే. వాటి ఆధారంగా ఏదన్నా పుస్తకం వస్తే అది అమెరికా మార్కెట్ లో హాట్ కేకులా అమ్ముడుపోతుంది. ఆ కోవలోనే వచ్చే వారం మార్కెట్ లోకి వస్తోంది మరో పుస్తకం. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాజీ భార్య ఇవానా ట్రంప్ రాశారు ఆ పుస్తకాన్ని. ట్రంప్ తో తన పరిచయం, పెళ్లి, విడాకుల వరకు సాగిన బంధాన్ని రైజింగ్ ట్రంప్ పేరు రాసిన పుస్తకంలో పొందుపరిచారు ఇవానా.
తాను తొలిసారిగా ట్రంప్ ను ఓ రెస్టారెంట్ లో చూశానని, అప్పుడు తనను ట్రంప్ చాలా బాగా చూసుకున్నారని ఇవానా గుర్తుచేసుకున్నారు. రెస్టారెంట్ నుంచి తాను బసచేసిన హోటల్ వరకు ట్రంప్ తనను దగ్గరుండి దిగబెట్టారని వెల్లడించారు. ట్రంప్ ఆర్గనైజేషన్ లో తాను కీలకపాత్ర పోషించానని, అయితే మార్లాతో ట్రంప్ కు శారీరక సంబంధం ఉందని తెలిసి తన మనసు విరిగిపోయిందని ఇవానా ఆవేదన వ్యక్తంచేశారు. తన పెళ్లి బంధం ముగిసిపోతుందని 1989 డిసెంబరులోనే తనకు అర్ధమయిందని ఇవానా చెప్పారు. తన భర్తకు, మార్లాకు మధ్య ఉన్న సంబంధం గురించి మార్లానే తనతో స్వయంగా చెప్పిందని ఇవానా తెలిపారు.
ఒక రోజు ఓ యువతి తన దగ్గరకు వచ్చి పరిచయం చేసుకుని… ట్రంప్ ను తాను ప్రేమిస్తున్నానని చెప్పిందని, తాను ఆ మాటలు నమ్మలేదని, ఆ యువతిని ఇంట్లో నుంచి పంపించివేశానని గుర్తుచేసుకున్నారు. మార్లాతో ట్రంప్ వివాహేతర సంబంధం గురించి తెలిసిన తర్వాత తాము ఇక ఆ బంధాన్ని కొనసాగించలేమని అర్ధమయిందని ఇవానా తెలిపారు. విడిపోయిన తర్వాత తమ కుమారుడు డొనాల్డ్ జూనియర్ ఏడాదిపాటు తండ్రితో మాట్లాడలేదని చెప్పారు. ప్రస్తుతం ట్రంప్, తాను స్నేహితుల్లా ఉన్నామని, తనకు రాయబారి పదవి ఇస్తానని కూడా చెప్పారని ఇవానా రైజింగ్ ట్రంప్ లో రాసుకొచ్చారు.
తన కుమార్తె ఇవాంకా ట్రంప్ అధ్యక్షురాలైతే బాగుంటుందని ఇవానా అభిప్రాయపడ్డారు. ప్రథమ మహిళ కన్నా… ప్రథమ తల్లి హోదా తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపారు. 1977లో ట్రంప్, ఇవానా వివాహం జరిగింది. 1990లో ట్రంప్ వివాహేతర సంబంధం గురించి న్యూయార్క్ వార్తాపత్రికల్లో అనేక కథనాలు వచ్చాయి. బెస్ట్ సెక్స్ ఐ హావ్ ఎవర్ హాడ్ పేరుతో ట్రంప్, మార్లా పై పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి. దీంతో 1992లో ట్రంప్ , ఇవానా విడిపోయారు. అనంతరం 1993లో ట్రంప్ మార్లాను పెళ్లిచేసుకున్నారు. అయితే కొంతకాలానికే ట్రంప్ మార్లాకు కూడా విడాకులు ఇచ్చారు. 1999లో మార్లా నుంచి విడిపోయిన ట్రంప్ 2005లో మెలానియాను వివాహం చేసుకున్నారు.