టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయనీ, దీనిపై తాము విచారణ జరిపిస్తామని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న నేటి సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తు చేసిన ఆయన గత ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ కొనుగోళ్లు, అందుకు చేసుకున్న ఒప్పందాలపై 9 మంది సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీకి ట్రాన్స్ కో సీఎండీ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. అలాగే ఈ కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బాలినేని శ్రీనివాసరెడ్డి ఏపీ అడ్వొకేట్ జనరల్, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం, ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ టీడీపీ ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన సౌర, పవన విద్యుత్ ధరలను సమీక్షించనుంది. అదే సమయంలో డిస్కంలకు తక్కువ ధరకు విద్యుత్ ను అమ్మేవారితో చర్చలు జరపనుంది.