Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తరువాత ఖాళీ అయిపోయిన వైసీపీ అధినేత జగన్ అమ్ముల పొదిలో ఎట్టకేలకి ఓ అస్త్రం చేరింది. అది కూడా రేవంత్ అందించాడు. తెలంగాణ తెలుగు దేశం నేతగా వున్న రేవంత్ కాంగ్రెస్ లో చేరేందుకు సర్వసన్నద్ధం అయినట్టు తెలుస్తోంది. అయితే తన చేరిక వెనుక రాజకీయ అభిలాష కన్నా ఆంధ్ర టీడీపీ నేతలు, మంత్రుల వ్యవహారశైలి కారణం అని చెప్పడానికి రేవంత్ ట్రై చేస్తున్నారు. ఇన్నాళ్లు బయటికి తెలియని రెండు విషయాల్ని రేవంత్ ప్రస్తావించారు. యనమలకు చెందిన వాళ్లకి కెసిఆర్ ప్రభుత్వం 2 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు ఇచ్చిందని, పరిటాల శ్రీరామ్, పయ్యావుల అల్లుడు కలిసి పెట్టె బీర్ ఫ్యాక్టరీ కి తెరాస సర్కార్ అనుమతులు ఇచ్చిందని రేవంత్ ఆరోపణల సారాంశం.
శ్రీరామ్ పెళ్లి కోసం అనంతపురం జిల్లాకి వచ్చిన కెసిఆర్ తో స్థానిక టీడీపీ నేతలు వ్యవహరించిన తీరుని రేవంత్ తప్పుబడుతున్నారు. చంద్రబాబు సీతక్క ఇంటిలో పెళ్ళికి వస్తే ఏ తెరాస నాయకుడు అయినా పట్టించుకున్నాడా అని ప్రశ్నిస్తున్నాడు. అలాంటప్పుడు కెసిఆర్ స్పెషల్ ఏంటి అని నిలదీసాడు. మేము పార్టీ కోసం కెసిఆర్ తో నిత్యం పోరాడుతుంటే మీరు మాత్రం వారితో జట్టు కట్టి ముందుకు వెళ్లడం లో అర్ధముందా అంటున్నారు. ఇలా రేవంత్ లేవనెత్తిన ప్రశ్నల వెనుక ఉద్దేశం ఏదైనా టీడీపీ కి నిజంగా ఇది సంకట పరిస్థితే.
పాదయత్రకి సిద్ధం అవుతున్న వైసీపీ అధినేత జగన్ కి తాజాగా రేవంత్ చేసిన ఆరోపణలు ప్రధాన అస్త్రం కానున్నాయి. ఓటుకి నోటు అంశాలన్ని పదేపదే ప్రస్తావించే జగన్ అందుకు మద్దతుగా ఇప్పుడు రేవంత్ ఆరోపణల్ని చెప్పే అవకాశం వుంది. ఇప్పటిదాకా జగన్ ని ఎదుర్కోవడంలో ఇబ్బంది లేకుండా సాగిపోతున్న టీడీపీ కి నిజంగా రేవంత్ ఎపిసోడ్ తలనొప్పి కానుంది. టీడీపీ లో అలుపెరగని యోధుడిగా రేవంత్ కి స్థానం వుంది. పార్టీ లో కొద్ది మంది నేతలు అంటే ప్రత్యేక అభిమానం వుంది. అలాంటి వారిలో రేవంత్ ముందు వరసలో వుంటారు. రేవంత్ ఏ ప్రయోజనం కోసం ఈ ప్రశ్నలు లేవనెత్తినా వాటిలో నిజం లేకపోలేదని టీడీపీ ని అభిమానించే వారికి కూడా తెలుసు. అందుకే రేవంత్ మాటల్ని వల్లె వేసే జగన్ కి కౌంటర్ ఇవ్వడం ఇంతకుముందు అంత సులభం అయితే కాదు.