ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతి చెందినవారికి సంబంధించి ఎనిమిది కుటుంబాలకు మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్య నారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్‌లు చెక్కులు అందించారు. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చెక్కులను అందజేశారు. మొత్తం ఎనిమిది కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి కురసాల కన్నబాబు మాట్లడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విధంగా మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందించామన్నారు. ఆ మొత్తాన్ని బ్యాంకులో జమచేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, సీఎం జగన్ వారికి రాసిన లేఖతో పాటు అందించామని తెలిపారు. ప్రస్తుతం ఎనిమిది కుటుంబాలకు చట్టపరమైన వారసులను గుర్తించామని, మిగిలిన నాలుగు కుటుంబాల వారసులు గుర్తించిన వెంటనే పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు.
చెక్కల పంపిణీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ‘బాధితులను తక్షణమే ఆదుకోవాలని, వారికి అండగా నిలవాలని భావించి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటిరూపాయల పరిహారం ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఆదివారం రాత్రి విశాఖపట్నంలో మంత్రులు, అధికారులతో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సోమవారం ఉదయమే మృతుల కుటుంబాలకు సహాయం అందించాలని ఆదేశించారు. మనస్సున్న మనిషిగా ఆయన స్పందించిన తీరుకు ఈ సహాయం ఓ నిదర్శనంగా చెబుతున్నాం. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి గురించి సమీక్షించాం. డిశ్ఛార్జ్ చేయాల్సిన వారిని గుర్తించి వారిని సురక్షిత ప్రాంతానికి పంపిస్తాం. రేపు ఎక్కువ మందిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుందని వైద్య అధికారులు తెలియచేశారు. ఎవరైతే పూర్తిగా కోలుకుని ఇకపై ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యాధికారులు ధృవీకరిస్తారో వారిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తాం.
డిశ్చార్జ్ చేసిన అనంతరం వారికి కూడా ముఖ్యమంత్రి ప్రకటించిన పరిహారాన్ని అందిస్తాం. ఐదు గ్రామాలలో బాధితులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు సహాయం అందిస్తామని సీఎం చెప్పారు. ఆ ప్రకారం గ్రామాలలోకి ప్రజలు తిరిగి వెళ్లిన వెంటనే వాలంటీర్లను ఇంటికి పంపించి పెన్షన్ మాదిరిగా ఇస్తున్నారో అదే విధంగా ఇంటివద్దకే పంపిస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తప్పకుండా సహాయం అందించడం వైఎస్ జగన్ మార్క్. అందుకే వారందరికీ సేవలు తక్షణం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. సంఘటన ఏడో తేదీ జరిగితే కేవలం మూడురోజుల వ్యవధిలో బాధిత కుటుంబాలకు కోటిరూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన దృష్ట్యా పారిశ్రామిక భద్రతకు సంబంధించి నూతన విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని అన్నారు.