విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా డీజీపీ గౌతమ్ సవాంగ్, విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్చంద్తో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలు, ఇతర అంశాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. ఘటన జరిగిన తర్వాత తీసుకున్న సహాయ చర్యలతోపాటు.. ఆస్పత్రుల్లో బాధితులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
విశాఖ గ్యాస్ లీక్ జరిగిన ప్రాంతానికి సీఎం వైఎస్ జగన్ మరికాసేపట్లో బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ అందుతున్న సహాయక చర్యలను సీఎం వైఎస్ జగన్ దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. కాగా, గురువారం తెల్లవారుజామున ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయన వాయువు లీకైంది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు.