ఏపీ రాజకీయాల్లో అవిశ్వాసం పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. దీని మీద నిన్న రాత్రి చంద్రబాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా నిన్న కోర్టుకు హాజరయి ఈరోజు ఉదయమే కాకినాడ చేరుకున్న జగన్ దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ చాలనే హక్కు చంద్రబాబునాయుడికి ఎవరిచ్చారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు అంగీకరించిన మీదటే ప్యాకేజీని ప్రకటించినట్టు నిన్న లోక్ సభలో మోదీ మాట్లాడిన విషయాలను గుర్తు చేశారు. హోదాయే కావాలని తొలి రోజు నుంచి పట్టుబట్టింది ఒక్క వైకాపా పార్టీయేనని అన్నారు. హోదా వస్తే, పరిశ్రమలు వచ్చి నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని, కానీ, తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్యాకేజీ వైపు మొగ్గుచూపి రాష్ట్రానికి అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు.
హోదా వస్తే హోటళ్లు, ఫ్యాక్టరీలు, ఆసుపత్రులు కట్టేవాళ్లు ఎంతో ఉత్సాహంతో రాష్ట్రానికి వచ్చుండేవారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రోజే నిలదీసుంటే హోదా వచ్చేదని, కానీ ఆయన రాజీ పడ్డారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు. నిన్న మోదీ మాట్లాడిన మాటలు తనకు బాధను కలిగించాయని, కాంగ్రెస్ కు చెందిన రాహుల్ గాంధీ కూడా తన ప్రసంగంలో అర నిమిషమైనా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడలేదని విమర్శించారు. ప్రత్యేక హోదాను తాము ఇస్తామని చెప్పామని, మీరు ఎందుకివ్వరన్న ప్రశ్నను ఆయన అడగలేదని గుర్తు చేశారు. సభలో చర్చ జరుగుతున్న సమయంలో, ఆ తరువాత చంద్రబాబు ప్రవర్తించిన తీరు ప్రజలకు మరింత బాధను కలిగించిందని జగన్ వ్యాఖ్యానించారు.
నిన్న లోక్ సభలో ఏపీ ప్రతినిధిగా గల్లా జయదేవ్ చేసిన ప్రసంగం, గత నాలుగేళ్లుగా తాము చెబుతున్నదేనని జగన్ అన్నారు. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వవద్దని ఎన్నడూ చెప్పలేదని తాము నాలుగేళ్లుగా చెబుతూనే ఉన్నామని, అవే మాటలను గల్లా జయదేవ్ లోక్ సభలో మాట్లాడారని, దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేసినట్టు అవునా? కాదా? అని జగన్ ప్రశ్నించారు. ఈ మాట తాను చంద్రబాబును సూటిగా అడుగుతున్నానని చెప్పారు. ప్రత్యేక హోదాకు సంబంధించి గల్లా జయదేవ్ చెప్పిన మాటలను, గత నాలుగేళ్లుగా తాము అసెంబ్లీలో, యువభేరిలో మాట్లాడిన మాటలకు సంబంధించిన రికార్డులను పరిశీలించాలని అన్నారు. తాను ధర్నాలు, నిరాహార దీక్షలతో ఢిల్లీ నుంచి గల్లీ వరకూ చెబుతున్న అంశాలనే గల్లా గుర్తు చేశారని అన్నారు.”అప్పట్లో మమ్మల్ని దారుణంగా వెక్కిరించారు, హోదా వేస్టని, కోడలు మగపిల్లాడిని కంటానంటే, అత్త వద్దంటుందా అన్న మాటలు… అదేమైనా సంజీవనా? అని వెక్కిరించారని చెప్పుకోచ్చ్హారు. ఆపై అసెంబ్లీలో చంద్రబాబు ఎమ్మెల్యేలకు పంచిన పుస్తకాన్ని చూపించారు జగన్. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు, లేని రాష్ట్రాలకు ఉన్న తేడాను నాడు చూపిన చంద్రబాబు, ఇప్పుడు అదే హోదా కావాలని ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారని జగన్ ప్రశ్నించారు.