విశాఖ ఎయిర్పోర్ట్లో దాడికి గురైన వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్కు హైదరాబాదులోని అదే పార్టీకి చెందిన దాక్తర్లకు చెందిన సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఎడమ భుజానికి వైద్యులు తొమ్మిది కుట్లు వేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే జగన్ కు సంబంధించి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. జగన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు నిర్ధారించారు. జగన్ ఎడమ భుజంలోకి కత్తి బలంగా దూసుకుపోయిందని వైద్యులు తెలిపారు.
దాదాపు 3 నుంచి 4 సెంటీమీటర్ల దూరం వరకు కండరానికి గాయం అయ్యిందని తొమ్మిది కుట్లు వేసినట్లు తెలిపారు. అయితే జగన్ రక్త నమూనాలను సేకరించామని వాటిని ల్యాబ్ కు పంపిచినట్లు వైద్యులు స్పష్టం చేశారు. అలాగే దాడికి ఉపయోగించిన కత్తిని సైతం ల్యాబ్ కు పంపించామన్నారు. ఏమైనా విషపూరిత ద్రావణాలు కత్తికి పూసి ఉంటారా అన్న సందేహంతో కత్తిని ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు. ప్రస్తుతం జగన్ ఆరోగ్యం చాలా నిలకడగా ఉందన్నారు. జగన్ రిపోర్ట్స్ వచ్చే వరకు అబ్జర్వేషన్ లో ఉంచుతామన్నారు.
శుక్రవారం రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉందని ఆ తర్వాత డిశ్చార్జ్ పై నిర్ణయం ప్రకటిస్తామన్నారు. సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో జగన్ వెంట ఆయన భార్య భారతి, తల్లి విజయలక్ష్మీతోపాటు వైసీపీ నేత ఆనం రాంనారాయణ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే ఆస్పత్రి బయట భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. జగన్ని పరామర్శించేందుకు వివిధ పార్టీల నాయకులు కూడా వస్తున్నారు. అలాగే మరోపక్క జగన్ మీద దాడికి పాల్పడిన వ్యక్తి వైసీపీ అభిమాని అని, ఉద్దేశపూర్వకంగా ఈ దాడి చేసినట్టు కనబడటం లేదని ఏపీ డీజీపీ ఠాకూర్ చెప్పడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
ఈ డీజీపీ టీడీపీ కార్యకర్తేమో అని తనకు అనిపిస్తోందని, ఈ కేసును కూలంకషంగా ఆయన పరిశీలించినట్టయితే ఆయన ఈవిధంగా మాట్లాడేవారు కాదేమోనని, కాపీ కొట్టి ఐపీఎస్ ఎగ్జామ్ ఆయన పాసయ్యాడేమోనంటూ ఠాకూర్ పై విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తామేమీ రాజకీయ ప్రకటనలు చేయడం లేదని, వాస్తవాలు మాత్రం చెబుతున్నామని, జగన్ కు తగిన భద్రత కల్పించమని, మంచి వాహనాలను ఇవ్వమని మొదటి నుంచి తాము విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అధిష్ఠానం, పోలీస్ అధికారుల్లో కొందరు కలిసి జగన్ ని అణగదొక్కాలని చూస్తున్నారని, ఆ ప్రయత్నాలు నెరవేరవని, తమ పార్టీ అధ్యక్షుడు జగన్ కు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తి సెల్పీ దిగుతానని కోరగా అందుకు జగన్ అంగీకరించారని, సెల్పీ దిగుతున్నట్టుగా నటించి తన వద్ద ఉన్న కత్తితో తమ అధినేత మెడ కోసేందుకు యత్నించాడని విజయసాయి చెప్పుకొచ్చారు. మూడున్నర సెంటీ మీటర్ల లోతులో జగన్ భుజానికి గాయమైందని, తొమ్మిది కుట్లు పడ్డాయని అన్నారు.