Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నిస్తేజం అలుముకున్న వైసీపీని తిరిగి గాడిన పెట్టేందుకు పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆరు నెలల విరామం తర్వాత మళ్లీ ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకున్నారు. అనంతపురం పట్టణంలో నిర్వహించిన యువభేరిలో సుదీర్ఘంగా ప్రసంగించిన జగన్ వైసీపీ భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ గతంలో జిల్లాల్లో యువభేరీలు నిర్వహించింది. చివరిగా ఆరు నెలల క్రితం గుంటూరులో 9వ యువభేరీ జరిగింది. ఆ తర్వాత ఇన్ని రోజుల విరామం తర్వాత అనంతపురంలో 10వ యువభేరీ నిర్వహించారు జగన్.
9వ యువభేరీకి, పదవ యువభేరీకి మధ్య ఇంత గ్యాప్ తీసుకోవడానికి జగన్ చెప్పిన కారణం వింటే నవ్వు రాక మానదు. విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయన్న ఉద్దేశంతో ప్రత్యేక హోదా ఉద్యమానికి విరామం ఇచ్చామని జగన్ బహిరంగ సభలో చెప్పుకొచ్చారు. 9వ యువభేరీ తర్వాత విద్యార్థులకు పరీక్షలు, సెలవులు, తర్వాతి విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ జరిగిందని, అందుకే ఉద్యమానికి విరామం ఇచ్చామని, ఇప్పుడు పోరాటాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని జగన్ చెప్పారు. ప్రశాంత్ కిషోర్ సలహాపై ఈ కారణం చెప్పారో లేక తనకే వచ్చిన ఆలోచనలో తెలియదు గానీ జగన్ మాత్రం ఈ హాస్యాస్పద వ్యాఖ్యలతో విమర్శలకు గురవుతున్నారు. నిజానికి జగన్ ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాడలేదో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనే చెప్పినట్టు గుంటూరులో 9వ యువభేరీ తర్వాత నిజంగానే విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయి. అదే సమయంలో జగన్ కూడా ఓ పరీక్ష రాశారు. బాగా ప్రిపేరయి రాసినా కూడా నంద్యాల ఉప ఎన్నిక ఫలితం జగన్ ఆ పరీక్షలో పాస్ కాకుండా అడ్డుపడింది. ఆ పరీక్ష ఏంటంటే..
బీజేపీతో సన్నిహితంగా మెలిగేందుకు చేసిన ప్రయత్నం. జగన్ ఈ ఆరునెలల కాలంలో చేసిన పని అదే. గుంటూరు యువభేరీ జరిగిన తర్వాత కొన్ని రోజులకు రాజకీయాల్లో మార్పులు మొదలయ్యాయి. 2014 ఎన్నికల నుంచి టీడీపికి మిత్రపక్షంగా ఉంటున్న బీజేపీ ఏ కారణం చేతనో జగన్ ను దగ్గరకు తీయటం మొదలుపెట్టింది. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కూడా అయ్యారు. ఒకప్పుడు జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడానికే నిరాకరించిన మోడీ… జగన్ తో చాలా సేపు సమావేశం కావడం జాతీయస్థాయిలో హాట్ టాపిక్ అయింది. ఈ పరిణామం తర్వాత ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుతో భేటీ కావడానికి మోడీ తిరస్కరించారనే వార్తలూ వచ్చాయి. ర్వాత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మోడీ అడగకముందే బీజేపీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు జగన్. ఇక చంద్రబాబు నాయుడుకు, మోడీకి మధ్య వారధిగా భావించే వెంకయ్య నాయుడుని మోడీ, అమిత్ షా ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేసి ఉపరాష్ట్రపతిని చేశారు. వైసీపీతో కేంద్రం చెలిమికి రూట్ క్లియర్ చేసుకునేందుకే..వెంకయ్యనాయుడ్ని మెయిన్ స్ట్రీమ్ నుంచి తప్పించారన్న వాదన వినిపించింది. జగన్ కూడా బీజేపీకి గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ, మోడీకి గానీ వ్యతిరేకంగా పన్నెత్తుమాట అనలేదు. నవరత్నాలు ప్రకటించి వైసీపీ రాజకీయ ప్రణాళికను ప్రకటించిన జగన్ ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు. దీంతో వైసీపీ, బీజేపీ మధ్య స్నేహం బలోపేతమైందని, త్వరలోనే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో వైసీపీ చేరుతుందనీ స్థానిక చానళ్లు, పత్రికల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో సైతం వార్తలు వచ్చాయి. కానీ నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తర్వాతసీన్ రివర్స్ అయింది. వైసీపీ పరాజయంతో ఖంగుతిన్న బీజేపీ… ఎంత వేగంగా దగ్గరయిందో అంతే వేగంగా వైసీపీకి దూరమయింది.
ఒకప్పుడు చంద్రబాబుతో భేటీ కావడానికి ఇష్టపడని మోడీ.. నంద్యాల ఉప ఎన్నిక లో గెలిచినందుకు ట్విట్టర్ లో టీడీపీకి అభినందనలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఏపీలో తమకు ఇప్పటికే ఓ మిత్రపక్షం ఉందని, మరో మిత్రపక్షం అవసరం లేదని వ్యాఖ్యానించి వైసీపీ ఆశలపై ఆదిలోనే నీళ్లు చల్లారు. నంద్యాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జగన్ ఫలితం తర్వాత తీవ్రంగా నిరాశపడ్డారు. ఆయనతో పాటు పార్టీలోని నేతలు, కార్యకర్తలు భవిష్యత్ పై ఆశలు పోగొట్టుకున్నారు. అందుకే పార్టీలో మళ్లీ పునరుత్తేజం నింపి 2019 ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు జగన్ తిరిగి పాత నినాదాన్ని ఎత్తుకున్నారు. బీజేపీతో ఎలాగూ చెలిమి కుదరదు కాబట్టి, ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టి ఏపీలో వైసీపీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు.