Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనంతపురం యువభేరీ లో వైసీపీ అధినేత జగన్ యువతకి భలే పిలుపు ఇచ్చారు. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రం దశ దిశా మార్చేస్తుందని ఆయన కాలేజీ స్టూడెంట్స్ కి హితబోధ చేశారు. హోదా వస్తే రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలు, రాకపోయినందువల్ల జరిగిన నష్టాలు కూడా వివరించారు. అందుకే ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాడుతోందని, అయితే ఇందులో తాము మాత్రమే కాకుండా మొత్తం యువత, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందుకొస్తేనే ప్రయోజనం ఉంటుందని కూడా జగన్ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో జగన్ అర్ధం చేసుకోవాల్సింది చాలా వుంది.
ప్రత్యేక హోదా విషయంలో ప్రతి ఆంధ్రుడు కేంద్రం తమని మోసం చేసిందనే అనుకుంటున్నాడు. ఇదే అంశం మీద పవన్ సభలు పెడితే జనం వెల్లువలా వచ్చారు. ఇక జగన్ పెట్టిన యువభేరికి కూడా యువత నుంచి మంచి స్పందనే వచ్చింది. అయితే కేంద్రం కఠిన వైఖరి చూసి సందిగ్ధంలో వున్న ప్రజల్ని పోరాటానికి సంసిద్ధం చేయడంలో మాత్రం ఆ ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. హోదా పోరాటంలో భాగంగా తలపెట్టిన విశాఖ సభకి వెళ్ళడానికి జగన్ ఎంత రచ్చ చేసాడో చూసాం. అయితే ఎప్పుడైతే ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ దొరికిందో సీన్ మొత్తం మారిపోయింది. జగన్ నోట ప్రత్యేక హోదా మాట మాయమై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల భజన మొదలైంది. ఎప్పుడు బీజేపీ చంక ఎక్కుదామా అని ఎదురు చూసినంత కాలం జగన్ కి జనం గుండెల్లో వున్న హోదా డిమాండ్ అసలే మాత్రం గుర్తుకు రాలేదు. ఆ ఆశలు త్రిశంకు స్వర్గంలో ఉండగానే నంద్యాల,కాకినాడ ఫలితాలు వచ్చాయి.
బీజేపీ పునరాలోచనలో పడడం, పవన్ హోదా డిమాండ్ తో యాత్ర కి రెడీ అవుతున్నారన్న వార్త బయటికి వచ్చేసరికి ఏ మళ్లీ స్పెషల్ స్టేటస్ జగన్ కి అస్త్రంగా కనిపించింది. ఆ అస్త్రానికి తుప్పు పట్టిందో లేదో తర్వాత సంగతి గానీ అసలు ప్రత్యేక హోదా డిమాండ్ చేసే నాయకుల్లో ఒక్కరు కూడా చిత్తశుద్ధితో ఉన్నట్టు జనం నమ్మలేదు. జగన్ విషయంలో ఈ అపనమ్మకం మరీ ఎక్కువ. ఆయనకి నిద్ర వచ్చిందని ఆవలించడానికి , ఆయనకి మెలకువ వచ్చిందని నోటి ముందు చిటికెలు వేయడానికి జనం రెడీ గా లేరు. మీ పోరాటంలో చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే జనం వాళ్ళంతట వాళ్ళే కదిలి వస్తారు. ఆ నమ్మకం, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత మాత్రం నేతలదే.