తెలంగాణలో ఎన్నికలు ముగిసినా ఇంకా వేడి చల్లార లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించి, ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ప్రజాకూటమిని పెద్ద దెబ్బెసింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన చాలా మంది సీనియర్లు ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమంత్రి రేసులో ఉన్నామంటూ చెప్పుకున్న చాలా మంది నేతలు ఘోర పరాభవాన్ని చవి చూశారు. జానారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, కొండా సురేఖ లాంటి వాళ్ళకు తెలంగాణ ఓటర్లు షాకిచ్చారు. అయితే, సంగారెడ్డి నుంచి పోటీ చేసిన జగ్గారెడ్డి మాత్రం విజయం సాధించారు. అయితే ఆయన ప్రచారంలో భాగంగా తనను జైలుకు పంపించిన గులాబీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్యాయంగా తనపై కేసు నమోదు చేశారని చేసిన వ్యాఖ్యల వల్ల వచ్చిన సానుభూతి ఆయనకు ప్లస్ అయింది.ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున చాలా మంది సీనియర్లు ఓడిపోయినా జగ్గారెడ్డి మాత్రం విజయం సాధించారు.
అయితే ఈ మధ్య ఆయన వ్యవహార శైలి అనుమానాలు రేకెత్తిస్తోంది.ఎన్నికల ప్రచారం సమయంలో తిట్టిన కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునేలా ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతోంది. దీంతో ఆయన కారెక్కుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన మాత్రం కార్యకర్తలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు వెళ్లి కాంట్రాక్టులు చేస్తానని, తన జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి సహకారంతో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని చెప్పారు. అంతేకాదు, తనకు సహకరించినా, సహకరించకపోయినా వచ్చే నాలుగేళ్ల వరకు ప్రభుత్వం, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులపై ఎలాంటి రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేయనని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. దీంతో జగ్గారెడ్డికి భయం పట్టుకుందని, త్వరలోనే ఆయన టీఆర్ఎస్లో చేరిపోతారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూర్చుతుండడంతో ఇది నిజమేనేమోననే అనుమానాలు కలుగుతున్నాయి.