నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 షో ఆసక్తికరంగా సాగుతోంది. ‘ఏదైనా జరగొచ్చు రెడీగా ఉండడంటూ’ ఆసక్తి రేపిన నాని బిగ్‌బాస్-2ను సక్సెస్ దిశగా నడిపిస్తున్నాడు. బిగ్‌బాస్ పట్ల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఆకట్టుకునే విధంగానే కంటెస్టెంట్స్ పెర్ఫామ్ చేస్తున్నారు దీంతో ఆ షోను చాలా మంది చూస్తున్నట్టు తేలింది. తొలి వారం ఈ కార్యక్రమం అత్యధికంగా టీఆర్పీ రేటింగ్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ షో ప్రతి శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ, శుక్ర వారాల్లో రాత్రి 9.30 గంటలకు స్టార్ మాటీవీలో ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. బీఏఆర్సీ గణాంకాల ప్రకారం సీజన్ 2 లాంచింగ్ ఎపిసోడ్‌కి టీఆర్పీ రేటింగ్ 15.05 వచ్చింది. వీక్ డేస్‌లో 7.93గా నమోదు అయింది. సీజన్-1లో జూ.ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉన్నప్పుడు మొదటి వారంలో వచ్చిన రేటింగ్స్‌కు ఇది కాస్త తక్కువే అయినప్పటికీ, ఈ షో పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని తగ్గకుండా చేశాడు నేచురల్ స్టార్ నాని. సరదాగా మొదలయిన బిగ్ బాస్ 2 లో అప్పుడే ఓ ఎలిమినేషన్ కూడా పూర్తయిపోయింది.
షోని ఇంకా రసవత్తరంగా మార్చేందుకు బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ మా విడుదల చేసిన ప్రోమోని బట్టి గురువారం బిగ్ బాస్ 2 మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో నేడు మరో విశేషం కూడా చోటు చేసుకోబోతోంది. జంబలకడి పంబ టీం హౌస్ లోకి ఎంటర్ కాబోతోంది. శ్రీనివాసరెడ్డి హీరోగా, సిద్ది ఇద్నాని హీరోయిన్గా జేబీ మురళీ కృష్ణ దర్శకత్వంలో ‘జంబ లకిడి పంబ’ సినిమా రేపు రిలీజ్ అవనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హాస్యనటుడు వెన్నెల కిశోర్ కూడా కీలక రోల్ పోషించాడు. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారంలో భాగంగా బిగ్‌బాస్ తెలుగు సీజన్-2 హౌస్‌కి శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్ ప్రవేశించారు. దానికి సంబందించిన ప్రోమో కూడా విడుదల చేసారు. నటుడు శ్రీనివాస్ రెడ్డి, కమెడియన్ వెన్నెల కిషోర్ హౌస్ లోకి సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే జంబ లకిడి పంబ చిత్రం మీద అనేక అంచనాలు నెలకొని ఉండగా ఇప్పుడు బిగ్ బాస్ లోకి శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్ ల ఎంట్రీతో ఆ హైప్ మరింత పెరిగింది.