తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న తెరాస పార్టీ నేతలకి ప్రజలనుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయం రోజూ గమనిస్తుందే. ఈ విషయంలో ఆందోళన చెందుతున్న తెలంగాణ శ్రేణులకు ఓట్ల సంగతి పక్కనపెడితే, నియోజకవర్గంలోని ప్రాంతాలలో ప్రచారానికి వెళ్తే, ఎలా తిరిగొస్తామో అనే కంగారు పుడుతుంది. ఓట్లు అడగడానికి వచ్చిన తెరాస నేతలని ప్రజలు తమకి మేలు చేస్తామని, హామీలు నెరవేరుస్తామని ప్రమాణం చేయాల్సిందిగా, పత్రాలు రాసివ్వలసిందిగా డిమాండ్లు చేయడంతో ఆ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు.ఇప్పుడు ఇలాంటి ఘటనే జనగామ నుండి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి కి ఎదురయ్యింది. జనగామ నియోజకవర్గంలోని నాగిరెడ్డి పల్లి గ్రామంలో ప్రచారానికి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బయలుదేరగా మార్గమధ్యంలోనే గ్రామస్థులు అడ్డుకొని, తమతో పాటు తెచ్చుకున్న బాండ్ పేపర్ పైన సంతకం పెట్టి, గ్రామంలోకి వెళ్లాలని చెప్పారు.
ఇంతకీ ఆ బాండ్ పేపర్ లో ఉన్న విషయాలు ఏమిటంటే చెరువు నిర్మాణం, నాగిరెడ్డిపల్లి – కొన్నే మధ్య బీటీ రోడ్డు నిర్మాణం, మార్కెట్ యార్డు నిర్మాణానికి భూమి విరాళం వంటి హామీలు మూడు నెలల గడువులోపు నెరవేరుస్తామని సంతకం పెడితేనే గ్రామంలోకి దారి వదులుతామని తెగేసి చెప్పడంతో, ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో జుట్టు పీక్కుంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు తెరాస నేత యాదగిరి రెడ్డి. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ప్రజలసొమ్ము అందినకాడికి తినడం అలవాటయ్యాక, హామీలు నెరవేర్చాల్సిందే అని బాండ్ పేపర్ మీద సంతకం అడిగితే కంగు తినరా ఈ రాజకీయ నాయకులు. ఏదేమైనా మంచి పనిచేసి బుద్ధి చెప్పారు గ్రామప్రజలు అని సోషల్ మీడియాలో అందరూ ప్రశంసిస్తున్నారు.