అమెరికాలోని డల్లాస్ టయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీ వేదికగా జరిగిన జనసేన ప్రవాసగర్జన సభలో ప్రవాస భారతీయుల నుద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ అమెరికా నడిబొడ్డున భారత ఔన్నత్యాన్ని చాటేందుకు వచ్చాను తప్ప విరాళాల సేకరణ కోసం రాలేదని అన్నారు. నేనిక్కడికి ఫండ్స్ వసూలు చేయడానికి రాలేదు. నేనెప్పుడూ ఎవరితోనూ డబ్బులు కలెక్ట్ చేయమని చెప్పను. ఏదైనా ఉంటే ఆఫీషియల్స్‌తో చెప్తాను. అది కూడా నాకు ఇష్టం ఉన్నప్పుడే. అసలు డబ్బులు దేనికి అని నన్ను చాలా మంది అడుగుతుంటారు. పవన్ కల్యాణ్ ఎక్కడైనా స్పీచ్ ఇవ్వాలంటే ఒక్కడే వస్తాడా..? నాతో పాటు నాలుగు వందల మంది కదలాలి.. 40 కార్లు రావాలి. ఎందుకంటే అమెరికన్ ప్రభుత్వం మనకు పోలీసులను ఇవ్వగలుగుతుంది కానీ, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులను ఇవ్వడంలేదు’’ అంటూ వ్యాఖ్యానించాడు. వాస్తవానికి పవన్ ఫండ్స్ వసూలు చేయడానికే అమెరికా వెళ్లాడని ఎవరూ అనలేదు. ఇలాంటి సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఎవరూ అనకపోయినా ఫండ్స్ గురించి మాట్లాడడం.. భుజాలు తడుముకున్నట్లే ఉంది. ఆ విషయం పక్కన పెడితే స్వాతంత్ర్య సమరయోధుల గురించి మాట్లాడుతూ భగత్ సింగ్ చరిత్ర చదివితే 23 ఏళ్ల వయసులో ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారనే విషయం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను చదవాలని సూచించారు. అయితే భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకోలేదని, దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారిపై హింసాత్మక ఉద్యమం చేపట్టి వారి చేతిలో ఉరితీయబడ్డారని అందరికీ తెలిసిందే. కానీ పవన్ కల్యాణ్ మాత్రం భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పవన్ పొరపాటుగా మాట్లాడిన మాటలను పవన్ అభిమానులు సమర్ధించుకుంటూ చంద్రశేఖర్ అజాద్ పేరు బదులు భగత్ సింగ్ పేరును పొరపాటుగా ప్రస్తావించారని అంటున్నారు. కానే నెటిజన్లు మాత్రం ఆయన మీద విరుచుకుపడుతున్నారు.