వైసీపీ అధినేత జగన్ దుందుడుకు వ్యాఖ్యలతో ఈ మధ్యే తెరమరుగు అవుతుంది అనుకున్న పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వ్యవహారం మళ్ళీ సీన్ లోకి వచ్చింది. అయితే జగన్ వ్యాఖ్యల్ని మించి దిగజారి పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. అయితే ఈ రచ్చ మధ్య రెండు రోజుల కిందటే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులు అయిన విజయబాబు కామెంట్స్ ఆసక్తికరంగా వున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి రాజకీయాల్లో ప్రస్తావించడం సరికాదని టీవీ చర్చల్లో బల్లగుద్ది చెప్పిన విజయబాబు ఎన్టీఆర్ తో పవర్ స్టార్ ని పోల్చారు. ఎన్టీఆర్ వృద్ధాప్యంలో లక్ష్మీపార్వతి ని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆయన్ని టీడీపీ తో పాటు జాతి మొత్తం గౌరవిస్తోందని, ఇప్పుడు పవన్ ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ఆ విషయాన్ని బట్టి ఆయన రాజకీయ సామర్ధ్యాన్ని అంచనా వేయడం సరికాదని విజయబాబు వాదన.
పవన్ ని సమర్ధించడానికి విజయబాబు లాజిక్ మిస్ అయ్యారు, లైన్ తప్పారు అనిపిస్తోంది. నిజానికి ఈ వ్యాఖ్యలు చేసింది టీడీపీ నాయకులు కాదు. వైసీపీ అధినేత జగన్. ఈ విషయాన్ని మర్చిపోయి టీడీపీ తో పాటు తెలుగు జాతి యావత్తు గౌరవించే ఎన్టీఆర్ ని సీన్ లోకి లాగడంతో ఔచిత్యం లేదు. ఎన్టీఆర్ భార్య చనిపోయాక వృద్ధాప్యంలో తోడు కోసం ఇంకో పెళ్లి చేసుకున్నారు. అందులో పెద్దగా అభ్యంతరం లేదు. కానీ ఆమెని రాజకీయాల్లోకి తీసుకురావాలి అనుకోవడమే ఆ పార్టీలో భారీ విస్ఫోటనానికి దారి తీసింది. ఇక పవన్ పెళ్లిళ్ల విషయం వ్యక్తిగతం. కానీ ప్రజాజీవితంలోకి వచ్చిన వ్యక్తుల వ్యక్తిగత జీవితాల ప్రస్తావన రావడం సహజం.
ఎప్పుడో ఎందుకు ఎవరో కుర్రోడు సైలెన్సర్ తీసి బైక్ నడుపుతుంటే కేస్ పెట్టారని చెప్పగానే పవన్ మాత్రం పరోక్షంగా బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ప్రస్తావన చేయలేదా ? ఇక సైలెన్సర్ లేకుండా రోడ్ మీద బైక్ వెళుతుంటే వచ్చే రొద గురించి పవన్ కి తెలియదా ? అది మిగిలిన వాళ్లకి ఇబ్బంది కదా అని అడగక్కర్లేదా ? సరే పవన్ పరిణితి విషయంలో ఇప్పటికే కొన్ని సందేహాలున్నాయి. ఇప్పుడు సీనియర్, అనుభవశాలి అనుకున్న విజయబాబు సైతం దారి తప్పారు అనిపిస్తోంది. ఓ పార్టీ పవన్ పై విమర్శ చేస్తే, ఆ పార్టీకి బదులు ఇవ్వాల్సింది పోయి ఇంకో పార్టీ గురించి ప్రస్తావన చేయడం సమంజసమా ? విజయబాబు ఆదిలోనే గాడి తప్పారు అనిపిస్తోంది.