పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటన తర్వాత గుంటూరు జిల్లాకి రావడానికి రెడీ అవుతున్నారు. ఇలా ఏ పార్టీ నాయకుడు అయినా పర్యటనకు వస్తున్నారు అంటే నాయకులు, శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నం అవుతారు. కానీ జనసేన నాయకులు మాత్రం ఏకంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్.పీ ఠాకూర్ ని కలిసి తమ నాయకుడు భద్రత మీద కొంత ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కి భద్రత పెంచాలని కోరారు. అందుకు డీజీపీ సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. వచ్చే నెల గుంటూరు జిల్లాకి పవన్ రాబోతున్న సందర్భంగా సాగుతున్న సన్నాహకం ఇది. అసలు పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో ఎందుకు సందేహం కలిగిందో మాత్రం బయటపెట్టలేదు.
జనసేన నాయకులు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ కూడా ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. భద్రత విషయంలో పవన్ కి హానీ కలిగేంత సందర్భం ఇప్పటిదాకా కనిపించలేదు. ఆయన్ని ఎవరూ బెదిరించింది లేదు. భయపెట్టేలా మాట్లాడింది లేదు. అయినా పదేపదే పవన్, జనసేన నాయకులు భద్రత విషయంలో సందేహాలు వ్యక్తం చేయడం వెనుక ఇంకా ఏదైనా కారణం ఉందేమో అని కూడా కొందరు అంటున్నారు. ఈ విషయంలో ఆరోపణలు చేసే ముందు అందుకు తగిన ఆధారాలు ఏమైనా ఉంటే జనసేన నాయకులు వాటిని జనం ముందు పెడితే బాగుంటుంది. ఆ ప్రయత్నాలు చేయకుండా పదేపదే తనకు ఏదో జరగబోతోందన్న మాటలు చెప్తూ పోతే కొన్నాళ్ళకు జనం ఈ మాటల్ని లైట్ తీసుకుంటారు. నాన్నా పులి కథ ని గుర్తు చేసుకుంటారు.