Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం అవుతున్న జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం మీద కూడా ఓ నిర్ణయం తీసుకుంది. అమరావతి పరిధిలో పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి పార్టీ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వమే స్థలాలు కేటాయిస్తోంది. అయితే శాసన సభలో బలాన్ని బట్టి కేటాయింపులు కావడంతో జనసేనకు ఆ అవకాశం లేదు. అందుకే సొంత ఖర్చు పార్టీ కార్యాలయం నిర్మించుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు.
అమరావతి పరిధిలో భూముల ధరలు భారీగా ఉండటంతో జనసేన కొనుగోలుకు ప్రయత్నం చేయకుండా లీజ్ ద్వారా కార్యాలయ ఏర్పాటుకు అవసరమైన భూమి సమకూర్చుకోడానికి డిసైడ్ అయ్యింది. మంగళగిరి మండలం చినకాకాని దగ్గర జాతీయ రహదారికి పక్కనే మూడు ఎకరాలు లీజుకు తీసుకున్నారు. జనసేన నాయకులు, ఆ భూములకు చెందిన రైతుల మధ్య అవగాహన ఒప్పందం జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. నిన్న అత్యంత రహస్యంగా జరిగిన ఈ ఒప్పందం గురించి రైతులు చెప్పడంతో బయటకు తెలిసింది. త్వరలో జనసేన కార్యాలయ నిర్మాణ పనులు కూడా చేపట్టే అవకాశం వుంది. పవన్ కళ్యాణ్ సైతం ఇక్కడ నుంచే పార్టీ వ్యవహారాలు నడిపేందుకు సన్నద్ధం అవుతున్నారట.