Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తప్పుడు ఆరోపణలకు దిగుతూ అంతర్జాతీయంగా భారత్ ను ఏకాకిని చేయాలని చైనా ఎంతగా ప్రయత్నం చేస్తోందో అంతగా మనకు ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరుగుతోంది. డోక్లామ్ వివాదం విషయంలో ఇప్పటికే అమెరికా భారత్ కు మద్దతివ్వగా ఇప్పుడు జపాన్ కూడా మనకే సపోర్ట్ గా నిలిచింది. బలవంతంగా చేసే ఏకపక్ష ప్రయత్నాలు యథాతథ స్థితిని మార్చలేవని జపాన్ ప్రకటించింది. వచ్చే నెలలో జపాన్ ప్రధాని షింజో అబే భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆ దేశం మనకు మద్దతు ప్రకటన చేయటం గమనార్హం.
డోక్లామ్ పై చైనా భూటాన్ మధ్య వివాదం ఉన్నట్టు తమకు తెలుసని, వివాదం ఉందని ఆ రెండు దేశాలు అంగీకరించాయని జపాన్ రాయబారి కెంజీ హిరమత్సు అన్నారు. ఇలాంటి వివాదాస్పద ప్రాంతంలో ఒక దేశం బలప్రయోగంతో పరిస్థితిని మార్చాలని చూడటం సరికాదని, వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కెంజీ సూచించారు. ఆసియా మొత్తం ప్రభావం చూపే ఈ అంశాన్ని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఈ వివాదంలో భారత్ పాత్రపై స్పందిస్తూ భూటాన్ తో ఉన్న ఒప్పందం ప్రకారం ఇండియా ఈ వివాదంలో జోక్యం చేసుకుంటోందని తమకు తెలిసిందని కెంజీ చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం దౌత్యపరమైన చర్చలకు భారత్ సిద్దంగా ఉన్నట్టు విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించారని, భారత్ అనుసరిస్తున్న వైఖరి సరైనదని, శాంతియుత పరిష్కారం కోసం ఈ వైఖరి కీలకమని తాము భావిస్తున్నామని కెంజీ స్పష్టంచేశారు. భూటాన్ భూభాగంలో ఉన్న డోక్లామ్ తమ ప్రాంతమని వాదిస్తూ చైనా అక్కడ రహదారి నిర్మాణ పనుల చేపట్టింది.
భారత్-భూటాన్-చైనా ట్రై జంక్షన్ వద్ద రోడ్డు నిర్మించటం భూటాన్ కే కాక భారత్ ప్రయోజనాలకు కూడా భంగకరమని మన దేశం ఆందోళన చెందుతోంది. దీంతో నిర్మాణ పనులను అడ్డుకుంది. రహదారి నిర్మాణాన్ని ఆపేయాలని బారత్ పలుమార్లు కోరినా చైనా వినకపోవటంతో భారత్ సైన్యాన్ని మోహరించింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని భారత్ ఎంత ప్రయత్నం చేసినా…సైన్యాన్ని ఉపసంహరించాల్సిందే అని చైనా పట్టుబడుతోంది. దీంతో రెండు నెలలుగా పరిస్థితులు అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి . అటు ఈ వివాదంలో చైనా వైఖరిని జాగ్రత్తగా పరిశీలిస్తున్న ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా భారత్ కు మద్దతు ప్రకటిస్తున్నాయి.
మరిన్ని వార్తలు: