Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం ఎన్ని వివాదాలకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె మరణం ఓ విధంగా తమిళనాడు రాజకీయాలనే కాదు మొత్తం రాష్ట్ర గతినే మార్చేసింది. జయ వ్యక్తిగత, రాజకీయ వారసత్వం కోసం ఇంకా యుద్ధం కొనసాగుతూనే వుంది. ఆమె ఆస్తులు, అన్నాడీఎంకే పార్టీలో పదవుల కోసం ఇంకా రచ్చ సాగుతూనే వుంది. ఈ రేసులో మొదట్లో అంతా తానే అయి ముందుకు నడిచిన శశికళ వర్గం ఇప్పుడు పూర్తి డిఫెన్స్ లో పడింది. పాత కేసులో శశికళ జైలుకు వెళితే, కేంద్రంతో కాలు దువ్వినందుకు ఆమె అనుచరగణం మీద ఐటీ ఇతరత్రా దాడులు కొనసాగుతూనే వున్నాయి. ఈ పరిస్థితుల్లో జయ మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలు వచ్చాయి. అక్కడా శశి వర్గానికి చెందిన దినకరన్ డబ్బులు పంచి, ఈసీ కి లంచం ఎర వేసి అడ్డంగా దొరికిపోయారు. తమిళ ప్రజల్లో ఇంకా శశికళ మీద ఎన్నో అనుమానాలు.
శశికళ వల్లే జయలలిత చనిపోయారని, కేసులు ఎదుర్కొన్నారని భావిస్తున్న వాళ్ళ సంఖ్య తమిళనాడులో చాలా ఎక్కువ. జయ మరణం తర్వాత శశి వ్యతిరేకులు ఇదే అంశాన్ని ఇంకాస్త విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ పరిస్థితుల్లో జనం నమ్మకాన్ని మళ్లీ పొందాలంటే జయ మరణంతో తమకు సంబంధం లేదని, చివరి దాకా ఆమె ఆరోగ్యం కోసం శ్రమించామని చెప్పేందుకు శశికళ వర్గం తాజాగా ఓ పాచిక విసిరినట్టు తెలుస్తోంది. జయ ఆస్పత్రిలో ఉండగా తీసిన ఓ వీడియో ను ఆర్కే నగర్ ఎన్నికలకు ముందు విడుదల చేసింది. ఆ వీడియో లో జయ జ్యూస్ తాగుతూ కనిపించారు.