సంచలనాలతో వార్తలలో నిలిచే టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజకీయరంగం నుంచి తాను తప్పుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు. సీఎం జగన్ తమవాడేనని వ్యాఖ్యానించిన జేసీ దివాకర్ రెడ్డి ఆయనను తాను ఎఫ్పుడూ ద్వేషించలేదని అన్నారు. వైసీపీ అధినేతపై తాను కేవలం రాజకీయపరమైన విమర్శలు మాత్రమే చేశానని అన్నారు. జగన్ తన కుమారుడు స్నేహితుడని అందుకే చంద్రబు ముందు కూడా తాను జగన్‌ను మావాడు అని సంభోదించేవాడినని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు శుభపరిణామం అని జేసీ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రాక్టీకల్‌గా ఆలోచిస్తున్నారని ఇదే రకంగా ముందుకు సాగితే ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నుంచి తనకు పిలుపు వచ్చిందనే విషయంపై జేసీ దివాకర్ రెడ్డి స్పందించలేదు. దీనిపై ఆయన సమాధానం దాటవేశారు. ఈరోజు అనంతపురంలోని ఎస్పీ కార్యాలయానికి జేసీ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గత 40 ఏళ్లుగా తనకు సహకరించిన పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపానని చెప్పారు. తన తండ్రి స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ రంగం నుంచి తప్పుకోవాలని నిర్ణయించానని అన్నారు. రాజశేఖరరెడ్డికి, తనకు మధ్య చిన్నచిన్న అభిప్రాయ భేదాలు ఉండేవని అయినప్పటికీ ఇద్దరి మధ్య సుహృద్భావం ఉండేదని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఏ రకంగా తగ్గించాలనే దానిపై విద్యావేత్తలు, మేధావులతో చర్చిస్తున్నామని ఈ ప్రక్రియ కొనసాగుతుందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తాను పార్టీ మారాలని భావించడం లేదని అన్నారు.