కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం సీఎం రమేష్ ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. మొన్న ఉదయం జడ్పీ కార్యాలయం ఆవరణలో రమేష్ దీక్షను ప్రారంభించారు. ఎంపీ సీఎం రమేష్‌తో పాటు కడప జిలాకే ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణదీక్షకు దిగారు. అయితే సీఎం రమేష్ చేపట్టిన దీక్షపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీక్షల వల్ల ఉక్కూ రాదు, తుక్కూ రాదు అంటూ ఎద్దేవా చేశారు. పాలకులకు పగ, ప్రతీకారం ఉండకూడదని, ఏపీకి ప్రధాని మోదీ ఏమీ చేయరని మూడేళ్ల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను చెప్పానని ఇప్పుడు ఆయనకు పరిస్థితి అర్థమయిందని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఉన్న భయంతో వారి మీది ఎవరైనా చేయి వేయాలన్నా భయపడేవారని ప్రస్తుతం ఆ చట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. వైయస్ రాజశేఖరరెడ్డిలోని సగం లక్షణాలు జగన్ లో ఉన్నా, ఆయన వెంట వెళ్లి ఉండేవారమని చెప్పారు. జగన్ కు అహంకారం చాలా ఎక్కువని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పందించారు. ఇప్పటికే రాష్ట్రం పట్ల కేంద్రం వ్యతిరేకంగా ఉందని… ఇలాంటి సందర్భాల్లో మరింత నిరాశపరిచేలా జేసీ మాట్లాడటం తగదని అన్నారు. ఎంపీ జేసీ మాటలు ఎవరూ పట్టించుకోవద్దని మంత్రి ఆది పిలుపునిచ్చారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధించే వరకూ పోరాడతామని ఆయన తేల్చిచెప్పారు. కడప పౌరుషమేంటో చూపిస్తామని… రానున్న ఎన్నికల్లో బీజేపీ-వైసీపీలను ప్రజలు తుంగలో తొక్కుతారని మంత్రి జోస్యం చెప్పారు.