Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అదేరీతిలో సంచలన ప్రకటన చేశారు. వచ్చే బుధవారం ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఎంపీగా ఫెయిల్ అయినట్టు తన మనస్సాక్షి చెబుతోందని, అందుకే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని జేసీ తెలిపారు. తాడిపత్రి సాగు, తాగునీటి అవసరాలు తీర్చలేకపోయానని, అనంతపురంలో రోడ్లు విస్తరించలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
అనంతపురం అభివృద్ధికి కొన్ని శక్తులు అడ్డుతగిలాయని మండిపడ్డారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో గెలవలేదని, ప్రజల మద్దతుతోనే ఎంపీ అయ్యానని జేసీ అన్నారు. విలువ లేనప్పుడు పదవిలో ఉండటం భావ్యం కాదని, తనలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండడం వృథా అని ఆయన వ్యాఖ్యానించారు. తన రాజీనామా లేఖను స్పీకర్ కు అందజేస్తానని తెలిపారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేసినా… టీడీపీలోనే కొనసాగుతానని, చంద్రబాబు వెంటే ఉంటానని జేసీ స్పష్టంచేశారు