Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒక సినిమాను నిర్మించాలనుకున్నప్పుడు ఆ సినిమాలో హీరో మార్కెట్ ఎంత, దర్శకుడి మార్కెట్ ఎంత, కథ ఎంత మేరకు మార్కెట్‌ను సాధిస్తుంది అనే విషయాలను బేరీజు వేసుకుని సినిమాను నిర్మించాల్సి ఉంటుంది. అలా కాకుండా అయిదు కోట్ల హీరోకు పది కోట్ల బడ్జెట్ పెట్టి, కొత్త దర్శకుడిని నమ్మి పది కోట్లు ఖర్చు చేస్తే మిగిలేది జీరో అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మార్కెట్‌కు తగ్గట్లుగా బడ్జెట్‌ను ఖర్చు చేస్తే సినిమా సక్సెస్ అయితే లాభాలు వస్తాయి, ఫ్లాప్ అయితే కొద్ది మొత్తంలో నష్టాలు మిగులుతాయి. కాని భారీ మొత్తంలో బడ్జెట్‌ను ఖర్చు చేసినప్పుడు సినిమా సక్సెస్ అయినా నిర్మాతకు లాభాలు రావు, ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఇక ఆ నిర్మాత కోలుకోలేడు. ఇది గతంలో మనం ఎన్నో సందర్బాల్లో, ఎన్నో సినిమాల నిర్మాతలకు చూశాం.
తాజాగా ‘గరుడవేగ’ చిత్రం పరిస్థితి కూడా అదేనా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా రాజశేఖర్ సక్సెస్ కొట్టిన దాఖలాలు లేవు. ఎన్నో వరుస ఫ్లాప్‌లు వచ్చినా కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు రాజశేఖర్ నటించిన సినిమా సక్సెస్ అయినా కూడా 20 కోట్లకు మించి వసూళ్లు చేయలేదు. కాని తాజాగా రాజశేఖర్ నటించిన ‘గరుడవేగ’ చిత్రం ఏకంగా 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ప్రవీణ్ సత్తారు కూడా పెద్దగా గుర్తింపు ఉన్న దర్శకుడు కాదు. ఈయన గత చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినా కూడా నిర్మాత జీవిత ఏ ధైర్యంతో ఇంత బడ్జెట్ పెట్టిందో అంటూ అంతా చెవులు కొరుకుంటున్నారు.
తాజాగా ‘గరుడవేగ’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్బంగా సినిమా బడ్జెట్ గురించి క్లారిటీ ఇచ్చింది. మొదట ప్రవీణ్ కథ చెప్పినప్పుడు అయిదు లేదా ఆరు కోట్లతో తీయాలని భావించాం. స్క్రిప్ట్ అయిన తర్వాత సినిమా ఎక్కువ బడ్జెట్‌తో తీస్తే బాగుంటుందని పది కోట్ల వరకు అంచనా వేయడం జరిగింది. సినిమా చిత్రీకరణ జరుపుతున్న కొద్ది ఎక్కడా రాజీ పడకుండా తీయడంతో ఏకంగా 25 కోట్లు దాటి పోయింది. ఇంత బడ్జెట్ సాహసం అనిపించినా కూడా కథపై నమ్మకంతో చేశాం అంటూ జీవిత చెప్పుకొచ్చారు. ఎంత కథ బలంగా ఉన్నా కూడా ‘గరుడవేగ’ 25 కోట్లను రికవరీ చేయడం అనేది దాదాపు అసాధ్యం అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప బడ్జెట్ రికవరీ అవ్వదు అంటూ సినీ వర్గాల వారు కూడా అంటున్నారు. రాజశేఖర్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు కూడా పెద్దగా డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపడం లేదు. ఏది ఏమైనా కూడా ఈ సినిమాను వచ్చే నెల 3న భారీగా విడుదల చేస్తామని జీవిత ప్రకటించింది.