Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జైలవకుశ లో జై పోస్టర్, ట్రైలర్ బయటికి వచ్చినప్పటినుంచి ఆ పాత్ర చుట్టూనే అందరి ఆలోచనలు తిరుగుతున్నాయి. ఓ స్టార్ హీరో విలన్ రోల్ పోషించడం టాలీవుడ్ లో పూర్తిగా కొత్త. అయితే ఆ సాహసం చేసాడు ఎన్టీఆర్. అందుకే ఇప్పుడు జైలవకుశ క్లైమాక్స్ ఇంత రసవత్తరంగా మారింది. సాధారణంగా ఏ సినిమాలో అయినా విలన్ చివరిలో చనిపోతాడు. కానీ ఇక్కడ హీరో, విలన్ ఎన్టీఆర్ ఒక్కరే. అందుకే ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ మీద చర్చోప చర్చలు సాగుతున్నాయి. సహజంగా ఇలా మూడు పాత్రల సినిమాలు సూపర్ స్టార్ కృష్ణ ఎక్కువగా చేశారు. అప్పటి ట్రెండ్ కి అనుగుణంగా అందులో ఓ పాత్ర చివరిలో చనిపోయేది. అందుకే ఇప్పుడు జరుగుతున్న చర్చ కూడా అదే. జైలవకుశ క్లైమాక్స్ లో జై ని చంపారా లేదా మార్చారా అని.
ఇప్పటికి ఈ విషయం తెలిసింది చిత్ర యూనిట్ లో ముఖ్యులతో పాటు సినిమా చూసిన సెన్సార్ సభ్యులకి మాత్రమే. అయితే కీలకమైన క్లైమాక్స్ గురించి ఎక్కడా బయటికి రాకుండా చిత్ర యూనిట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. సెన్సార్ సభ్యులు కూడా అసలు విషయం దాటేసి సినిమా చివరి 20 నిమిషాల్లో ఎన్టీఆర్ నటన పెద్ద ఎన్టీఆర్ ని గుర్తు చేసింది అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇలా వాళ్ళు చెప్పిన మాటల్లో నుంచి క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో కొందరు వూహించుకుంటున్నారు. అయితే సినిమాకి వచ్చే ప్రతి ప్రేక్షకుడికి నచ్చేలా క్లైమాక్స్ ఉంటుందని చిత్ర యూనిట్ భరోసాగా వుంది. ఎన్టీఆర్ ఈ సినిమా ఒప్పుకోడానికి ప్రధాన కారణాల్లో క్లైమాక్స్ కూడా ఒకటి. ఏదేమైనా ఇప్పుడు జైలవకుశ లో జై పాత్ర తో పాటు క్లైమాక్స్ కూడా చిత్రసీమ తో పాటు సామాన్యుడిదాకా హాట్ టాపిక్ అయ్యింది.