ఆ గుంపులో ఒక్కడి మీద కోపమేల ఎన్టీఆర్ ?

Jr. NTR sensational comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జైలవకుశ భారీ విజయం సాధించిన పండగ చేసుకోవాల్సిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రిటిక్స్ మీద క్లినికల్ విమర్శలు చేసి తేనె తుట్టె రేపాడు. ఓ పక్క జనం ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసి కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నా రివ్యూలు రాసేవాళ్ళు మాత్రం సినిమా కి డామేజ్ చేసే పనికి దిగారని ఎన్టీఆర్ బాధపడ్డారు. అందులో కొంత నిజం కూడా వుండి ఉండొచ్చు. కానీ ఎన్టీఆర్ కానీ ఈ క్రిటిక్స్ కి సినిమా గురించి ఏమి తెలుసని నిలదీసే దర్శక, నిర్మాతలు, హీరోలు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. రివ్యూ లు రాయడం మొదలు అయ్యాక బాగున్న ఏ సినిమా కూడా వాటి వల్ల పూర్తిగా దెబ్బ తినలేదు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే సమీక్షకుడు అనగానే సినిమా జనం ఓ శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. కానీ రివ్యూ లు రాసే క్రిటిక్ ఏమీ ఆకాశము నుంచి ఊడిపడలేదు. వాళ్ళు రాసే కామెంట్స్, చేసే విమర్శలు, ఇచ్చిన రేటింగ్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు.

ఓ సినిమా రిలీజ్ అవ్వగానే థియేటర్ లో నుంచి వచ్చే వాళ్ళ ముందు వివిధ చానెల్స్, డిజిటల్ మీడియా కి సంబంధించిన వాళ్ళు మైక్ లు ముందు పెడుతున్నారు. కాస్త జాగ్రత్తగా చూస్తే ఆ బయటికి వచ్చే కొందరికి సినిమా నచ్చుతుంది, కొందరికి నచ్చడం లేదు. వారు ఏమి అనుకుంటే అదే ప్రేక్షకులు కూడా చెబుతున్నారు. అంత మాత్రాన సినిమా రిలీజ్ రోజే బాగా లేదని చెబితే బిజినెస్ పోతుందని ఆ ప్రేక్షకుడిని ఎవరైనా తప్పు పట్టగలరా ? అలాగే టికెట్ కొని వచ్చిన ప్రేక్షకుడు ఎంతో ఆ గుంపులో ఒక్కడే సమీక్షకుడు. ప్రేక్షకుడు తాను అనుకున్నది మైక్ ముందు చెబితే, భాష మీద పట్టు వుండి భావాన్ని నలుగురికి పంచాలి అనుకునే వాడు సమీక్షకుడు అవుతాడు. సినిమా బాగుంటే మైక్ ముందు ఎవరో ఒకరిద్దరు ప్రేక్షకులు బాగా లేదన్నంత మాత్రాన ఆ సినిమా ఆడకుండా పోదు. ఇదే సమీక్షకుడి విషయంలోనూ జరుగుతుంది.

ప్రేక్షకులు సమీక్షకుడు దృష్టి కోణం నుంచి సినిమా చూడరని ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. తెలుగులో సినీ సమీక్షకు ఓ స్థాయి కల్పించిన గుడిపూడి శ్రీహరి కి అన్నమయ్య సినిమా నచ్చలేదు. అందులో ఎన్నో తప్పులు ఉన్నాయని ఆయన రాసినా ఎవరూ పట్టించుకోలేదు. రాఘవేంద్రరావు, నాగార్జున కెరీర్ ని ఆ సినిమా మలుపు తిప్పింది. అంతెందుకు రామ్ గోపాల్ వర్మ తొలి సినిమా శివ గురించి అప్పట్లో గొప్ప రివ్యూస్ రాలేదు. కానీ తెలుగు సినిమా చరిత్రలో అది ఓ మైలు రాయి అయ్యింది. ఇక అప్పట్లో ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా పెద్దగా నచ్చలేదని అంటారు. కానీ సినిమా హిట్ కాలేదా ? అందుకే రివ్యూ రాసే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారని అనుకుని వారికి లేనిపోని ప్రాధాన్యం ఇవ్వాల్సిన పని లేదు సినీ జనాలకి. సినిమా బాగుంటే అన్నీ కొట్టుకుపోతాయి. అందులో క్రిటిక్ చేసే విమర్శలతో సహా. సినిమా బాగా లేకపోతే ఎన్ని పెయిడ్ ఆర్టికల్స్ రాసినా అది నిలబడదు. అందుకే క్రిటిక్ ని కూడా రిలీజ్ సినిమా చూసే గుంపులో ఒకడిగా భావించాలి తప్ప అంతకు మించి ఊహించుకుని కోపం పెంచుకుంటే ఎలా ఎన్టీఆర్ ?