Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమాపై అందరి దృష్టి కేంద్రీకృతం అయ్యి ఉంది. దాదాపు సంవత్సర కాలంగా జక్కన్న ఏ సినిమా చేస్తాడు, ఎలా చేస్తాడు అంటూ చర్చ జరిగింది. ‘బాహుబలి’ చిత్రం తర్వాత రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌తో చేయాలని కోరుకున్నాడు. అందుకోసం రెండు మూడు స్టోరీ లైన్స్‌ను ఎన్టీఆర్ కోసం సిద్దం చేసుకున్నాడు. స్టోరీ కూడా వినకుండానే ఎన్టీఆర్ ఓకే చెప్పేయడం జరిగింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌కు మంచి ఆలోచన వచ్చింది. ప్రస్తుత సమయంలో స్టార్ హీరోల మల్టీస్టారర్‌ను మోసేందుకు దర్శకులు సిద్దంగా లేరు. ఏ దర్శకుడు చేసినా కూడా ప్రేక్షకులు అంతగా ఆధరించడం కష్టమే. కాని మల్టీస్టారర్ చేయడం వల్ల తప్పకుండా మంచి ఫలితం ఉంటుందనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ మల్టీస్టారర్ కోసం జక్కన్నను కోరడం జరిగింది.
రామ్ చరణ్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇద్దరి స్నేహం తప్పకుండా సినిమాకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో రాజమౌళిని ఒప్పించి మల్టీస్టారర్‌కు తెర తీసినట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ కూడా ఒక మంచి సినిమాను, భారీ సినిమాను, చరిత్ర సృష్టించే సినిమాను చేసేందుకు తాను మాత్రం ఎందుకు నో చెబుతాను అంటూ తారక్ చెప్పిన వెంటనే ఓకే అన్నాడు. అసలు రామ్ చరణ్‌తో ఇప్పట్లో జక్కన్న సినిమా చేయాలని భావించలేదు. కాని ఎన్టీఆర్ ముందడుగు వేసి మల్టీస్టారర్‌కు ప్రాణం పోశాడు అంటూ టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ చిత్రంలో నటిస్తుండగా బోయపాటి దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నారు.