తెలంగాణ వరప్రదాయినిగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మరో రికార్డును సొంతం చేసుకుంది. శంకుస్థాపన చేసిన తరువాత, అతి తక్కువ సమయంలో పనులు పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు, విన్నర్స్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్, కంట్రీ రికార్డ్స్ లో స్థానాన్ని పొందింది. అత్యంత భారీ ప్రాజెక్టుగా, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు నేడు జాతికి అంకితంకానున్న సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు గురించి భారత ముఖ్య సలహాదారు కొండవీటి మురళి ఓ ప్రకటన చేశారు. ప్రాజెక్టును నిర్మించిన నిర్మాణ సంస్థ ‘మేఘా’తో పాటు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారీ మోటార్లను తయారు చేసి అందించిన బీహెచ్ఈఎల్ సైతం రికార్డులో చోటు దక్కించుకున్నాయని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే తెలంగాణ సర్కారుకు, మేఘా, బీహెచ్ఈఎల్ సంస్థలకు తెలియజేశామని అన్నారు.